వేలూరు: వేలూరు జిల్లా అనకట్టు సమీపంలోని వేలంగాడు పొర్‌కోడియమ్మన్ ఆలయ చెరువు జాతర బుధవారం కోలాహలంగా జరిగింది. ప్రతి సంవత్సరం చిత్ర మాసంలో చెరువులో 10 గ్రామ పంచాయతీలు కలిసి పొర్‌కోడిఅమ్మన్ జాతర నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా మంగళవారం రాత్రి అమ్మన్‌ను అలంకరించిన రథంలో ఆశీనులు చేసి వెల్లండ్రం గ్రామం నుంచి ఊరేగింపుగా చెరువులోకి తీసుకొచ్చి ఆలయంలో ఉంచారు. అనంతరం ఉదయం అమ్మవారిని దర్శించుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారి రథాన్ని భక్తిశ్రద్ధలతో చెరువులోకి తీసుకొచ్చారు. రథోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రథంపై బొరుగులు, మిరియాలు చల్లి మొక్కులు తీర్చుకున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి పొంగుళ్లు పెట్టి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీ శ్రేణులు భక్తులకు అన్నదానం చేసి మజ్జిగ పంపిణీ చేశారు. కార్యక్రమంలో దేవదాయశాఖ జాయింట్ కమిషనర్ విజయ, అసిస్టెంట్ కమిషనర్ జీవానందం, ఎగ్జిక్యూటివ్ అఽధికారి అన్నామలై, దేవదాయ శాఖ జిల్లా చైర్మన్ అశోకన్, ఉత్సవ కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
పాఠశాలలకు పాఠ్యపుస్తకాల పంపిణీ
నగరి: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ను కొనియాడుతూ మాజీ మంత్రి ఆర్‌కే రోజా ట్వీట్ చేశారు. సింగిల్‌గా పోటీ చేసి సత్తా చాటుకున్నారని, అభిమానులు.. నమ్మకున్న కేడర్‌కు భరోసా కల్పిస్తున్నారని ప్రశంసించారు. ఈ మేరకు రోజా ట్వీట్‌కు సీఎం విజయ్ స్పందించారు. హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ రీ ట్వీట్ చేశారు.
నాగలాపురం: మండలంలోని వేదవల్లి సమేత వేద నారాయణస్వామి ఆలయంలో బుధవారం ఏకాదశి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. భక్తులు బారీ సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. సాయంత్రం 6.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత వేదనారాయణ స్వామి ఉత్సవమూర్తులను అలంకరించి తిరుచ్చి వాహనంపై తిరు వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు.
రేణిగుంట: పట్టణంలోని రైల్వే అండర్ బ్రిడ్జ్ మరమ్మతు పనులు పూర్తి అయ్యాయి. దీంతో బుధవారం మధ్యాహ్నం రైల్వే అండర్ బ్రిడ్జి మీదుగా వాహనాల రాకపోకలను రేణిగుంట తహసీల్దార్ శ్యామ్ ప్రసాద్, ఎంపీడీఓ రవిచంద్ర, రైల్వే అధికారులు, పట్టణ సీఐ జయచంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ రవిచంద్ర మాట్లాడుతూ సకాలంలో రైల్వే అండర్ బ్రిడ్జిని పూర్తి చేసినందుకు రైల్వే అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అండర్ బ్రిడ్జ్ అనుకున్న విధంగా సకాలంలో పూర్తి చేసినందుకు అధికారులను స్థానిక టీడీపీ నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో టీడీపీ రేణిగుంట మండల అధ్యక్షుడు మునిచంద్రారెడ్డి, పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా, క్లస్టర్ ఇన్‌చార్జి పుష్పనాథన్ తదితరులు పాల్గొన్నారు.
తిరువొత్తియూరు: తమిళనాడులోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లోని ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసే పనిని విద్యాశాఖ ప్రారంభించింది. జూన్ నెలలో పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో 2025–26 విద్యా సంవత్సరానికి అవసరమైన పుస్తకాల్లో 99 శాతం ఇప్పటికే ముద్రించబడ్డాయి. ఈ ఏడాది రూ. 4.19 కోట్ల పుస్తకాలు అవసరమని గుర్తించగా, అందులో 4.16 కోట్ల పుస్తకాలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. మిగిలిన 1 శాతం పుస్తకాలు కూడా కొద్ది రోజుల్లోనే పూర్తి చేసి పంపిణీ చేస్తారు. తమిళనాడు పాఠ్యపుస్తక, విద్యా సేవల సంస్థ ద్వారా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఈ పుస్తకాలను ఉచితంగా అందిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాల విద్యార్థుల కోసం రాయితీ ధరలకు పుస్తకాలను అందుబాటులో ఉంచారు. మే నెలాఖరు నాటికి అన్ని పాఠశాలలకు పుస్తకాలు చేరతాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే 1, 2, 3వ తరగతులకు అవసరమైన లక్షలాది పుస్తకాలు గోడౌన్‌లకు చేరుకున్నాయి.
జాతరకు పటిష్ట పోలీస్ బందోబస్తు
వేలూరు: వేలూరు జిల్లా గుడియాత్తంలోని గంగమ్మ శిరస్సు జాతర ఈనెల 15న శుక్రవారం జరగనుంది. గురువారం ఉదయం అమ్మవారి రథోత్సవం, శుక్రవారం ఉదయం శిరస్సు ఉత్సవం జరగనుంది. ఇందుకుగాను వేలూరు, ఆంబూరు, తిరుపత్తూరు, చిత్తూరు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. జాతరకు వివిధ రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు రానున్న నేపత్యంలో అవసరమైన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. ఇందుకోసం మూడు తాత్కాలిక బస్టాండ్‌లు ఏర్పాటు చేయడంతో పాటు కారు పార్కింగ్‌లు నాలుగు చోట్ల ఏర్పాటు చేశారు. బందోబస్తుపై ఎస్పీ శివరామన్ నేరుగా వెళ్లి పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ రెండు రోజుల పాటు జరిగే జాతరలో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఇందుకు భక్తులు సహకరించాలన్నారు. జాతర పురస్కరించుకొని ఈనెల 15న వేలూరు జిల్లా వ్యాప్తంగా సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ సుబ్బలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు.


