విశ్వరూపం.. పులకించిన భక్త గణం | - | Sakshi
Sakshi News home page

విశ్వరూపం.. పులకించిన భక్త గణం

May 14 2026 6:21 AM | Updated on May 14 2026 6:21 AM

● ముగిసిన తిరుపతి గంగ జాతర

తాతయ్యగుంట గంగమ్మ విశ్వరూపం.. భక్త కోటికి అపురూపం.. ఈ ఘట్టం అద్భుత కావ్యం.. అది వీక్షించడానికి తరలివచ్చిన లక్షలాది మంది జనం.. వారిలో తొణికిసలాడిన భక్తి భావం.. ఎదురు చూసిన క్షణం ఆసన్నం.. అమ్మా..గంగమ్మా.. కోరిన కోర్కెలు తీర్చే కల్పివల్లీ.. మాయమ్మ.. కరుణించి కాపాడవమ్మా తల్లీ గంగమ్మ అంటూ ప్రణమిల్లిన భక్త గణం.. అనంతరం పేరంటాలు విశ్వరూప ప్రతిమ చెంప నరకడంతో జాతర పరిసమాప్తం.. మట్టి కోసం ఎగబడిన జనం.. ఇదీ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర వైభవం.

తిరుపతి కల్చరల్‌: తిరుపతి గంగమ్మ జాతరలో భాగంగా మంగళవారం రాత్రి అమ్మవారి విశ్వరూప దర్శనంతో భక్తులు పులకించిపోయారు. తాతయ్యగుంట గంగమ్మ జాతర వైభవంగా సాగింది. ఏడు రోజుల గంగమ్మ జాతరతో లక్షలాది మంది భక్తజనం అత్యంత భక్తి శ్రద్ధలతో గంగమ్మతల్లిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. రోజువారీ వేషధారణలతో భక్తులు సందడితో నగర వీధులు హోరెత్తాయి. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి..గంగమ్మతల్లికి పొంగళ్లు పెట్టి, నైవేద్యం సమర్పించి, కుటుంబ సమేతంగా ప్రణమిల్లి, మొక్కులు చెల్లించుకున్నారు. ఏడు రోజుల పాటు గంగమ్మ నామస్మరణలు, జాతర వేషాల సందడి, డప్పుల ధరవుల మోతతో తిరుపతి హోరెత్తింది. గంగజాతర చివరి రోజైన మంగళవారం అర్ధరాత్రి తర్వాత తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో ప్రత్యేకంగా కొలువుతీరిన గంగమ్మ విశ్వరూప ప్రతిమ దర్శనంతో భక్తులు పులకించారు. భక్తులు భక్తి పారవశ్యంతో గంగమ్మ తల్లీ.. కరుణించి కాపాడు తల్లీ అంటూ అమ్మవారి విశ్వరూపానికి చేతులెత్తి మొక్కి, వేడుకున్నారు. ఈనెల 5వ తేదీన అర్ధరాత్రి చాటింపుతో ఆరంభమైన తిరుపతి గంగజాతర భక్తకోటి మొక్కులతో ప్రతి రోజూ తాతయ్యగుంట గంగమ్మ ఆలయం భక్తులతో కిక్కిరిసింది. ఆలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసుల సహకారంతో భక్తులకు పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఆలయ ఆవరణలో పోలీసుల సమక్షంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్యాలరీల్లో భక్తులు మంగళవారం అర్ధరాత్రి నుంచే అమ్మవారి విశ్వరూప దర్శనం కోసం ఎదురు చూశారు. అర్ధరాత్రి తర్వాత సంపూర్ణంగా అమ్మవారి విశ్వరూపం కొలువు కాగా అమ్మా... గంగమ్మా... చల్లంగా చూసి కాపాడవమ్మా అంటూ భక్తులు చేతులు జోడించి అమ్మవారిని వేడుకున్నారు. జాతర చివరి రోజు రాత్రి పేరంటాల వేషధారుడు కై కాల కులస్తుడు నగర వీధులు విహరిస్తూ భక్తుల పూజలందుకున్నారు. బుధవారం వేకువ జామున తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి చేరుకున్న పేరంటాలు గంగమ్మతల్లి విశ్వరూప ప్రతిమ చెంప నరకడంతో జాతర సమాప్తమైంది. దీంతో అత్యంత పవిత్రంగా భావించే గంగమ్మ విశ్వరూప ప్రతిమ బంకమట్టి కోసం భక్తులు ఎగబడ్డారు. అనంతరం పేరంటాలు తాళ్లపాక పెద్ద గంగమ్మ ఆలయానికి చేరుకుని అక్కడ కొలువైన పెద్ద గంగమ్మ విశ్వరూప ప్రతిమ చెంపనరకడంతో జాతర ఘట్టం ముగిసింది.

Advertisement
 
Advertisement
Advertisement