సాక్షి, చైన్నె: తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గిన నేపథ్యంలో డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ సామాజిక మాధ్యమం ఎక్స్ పేజీ వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. టీవీకే ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఆయన ‘మురికి రాజకీయం’గా అభివర్ణించారు.
నిరసనగా వాకౌట్
టీవీకే ప్రభుత్వం ఏర్పడటానికో లేదా కొనసాగడానికో డీఎంకే అడ్డుపడదు అనే నిర్ణయానికి అనుగుణంగానే తమ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. మా నిర్ణయానికి మద్దతుగా నిలిచిన మిత్రపక్షాల నేతలకు (ప్రేమలత విజయకాంత్, జవాహిరుల్లా తదితరులు) కృతజ్ఞతలు తెలియజేశారు.
మిత్రపక్షాల మద్దతుపై స్పష్టత
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన రాకూడదనే ఉద్దేశంతోనే కమ్యూనిస్టులు, వీసీకే, ఐయూఎంఎల్ వంటి పార్టీలు విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాయని, వారి నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని ఆయన స్పష్టం చేశారు. పరిశుద్ధమైన రాజకీయం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వారు తాజాగా మురికి రాజకీయాలకు తెరలేపారని మండిపడ్డారు. చీలిన అన్నాడీఎంకే అనే మడుగులో చేపలు పట్టాలని చూస్తూ, ఆ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని స్టాలిన్ ఆరోపించారు. టీవీకేకు ఓటు వేసిన ప్రజలే ఇప్పుడు బాధపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం.. మీ పనులను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అని వ్యాఖ్యలు చేశారు. పార్టీని వీడి తమరికి మద్దతు ఇచ్చిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు ఇచ్చే ‘రిటర్న్ గిఫ్ట్’ ఏమిటో కూడా ప్రజలు చూస్తార అని ధ్వజమెత్తారు. డీఎంకే తన సిద్ధాంతాలకు కట్టుబడి ఒక బలమైన ప్రతిపక్షంగా పనిచేస్తుందని స్టాలిన్ స్పష్టం చేశారు.


