సత్యరాజ్ అభినందనలు
తమిళసినిమా: తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి ముందు, ఆ తరువాత పలు ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకోవడం, చర్చనీయాంశంగా మారడం చూస్తూనే ఉన్నాం. కాగా ఎన్నికల్లో విజయ ఢంకా మోగించి తమిళగ వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. కాగా మంగళవారం శాసనసభా నేతను ఎంపిక చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభలో విశ్వాస ప్రతిపాదన సందర్భంగా జరిగిన చర్చలో ప్రతి పక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ప్రసంగిస్తూ ప్రజలను విభజించే సనాతనాన్ని అంతం చేయాలని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి. ప్రముఖ నటుడు సత్యరాజ్ ప్రతి పక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను స్వాగతిస్తూ, ఆయన్ని అభినందించారు. దీని గురించి ఆయన ఒక వీడియోను విడుదల చేశారు. అందులో.. ప్రియమైన మిత్రుడు ప్రతి పక్షనేత ఉదయనిధి స్టాలిన్ శాసన సభలో చేసిన ప్రసంగాన్ని విన్నాను. బాధ్యతను విస్మరించకుండా, గౌరవం తగ్గకుండా, క్రమశిక్షణ కలిగినట్లుగా ఆ ప్రసంగం ఉంది. అదే సమయంలో ఆయన ధైర్యాన్ని అభినందిస్తున్నాను. ప్రజలను విడదీసే సనాతనం అంతం కావాలని చెప్పిన ఆయన గట్స్‌ను మెచ్చుకుంటున్నాను. అలా చెబితేనే ఈ 2కే జెన్సీ కిడ్స్‌కు అర్థం అవుతుంది. సనాతనం అంతం కావాలన్న పదంలోనే సమాజం రక్షించబడాలి అనే అర్థం దాగి ఉంది నటుడు సత్యరాజ్ పేర్కొన్నారు.


