ఏకగ్రీవ ఎన్నిక డిప్యూటీ స్పీకర్‌గా రవిశంకర్ ఆసక్తికరంగా సాగిన నేతల ప్రసంగాలు అందరికీ సమాన అవకాశం కల్పించాలని పట్టు నిబంధనల మేరకు నడుచుకుంటానన్న స్పీకర్ నేడు సీఎం విజయ్ విశ్వాస పరీక్ష
రాజకీయాల్లో డీఎంకేనే సీనియర్ : ఉదయనిధి
సాక్షి,చైన్నె: కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, వీసీకే , ఐయూఎంఎల్ మద్దతుతో టీవీకే చీఫ్ సీ జోసెఫ్ విజయ్ సీఎం అయ్యారు. పరిపాలనా వ్యవహారాలపై దృష్టి పెడుతూనే సోమవారం అసెంబ్లీని సమావేశ పరిచారు. సభ్యులందరితో ప్రమాణ స్వీకారం ఈ సందర్భంగా ఆరోగ్యకర వాతావరణంలో జరిగింది. అనంతరం రాజకీయ నాగరికతను చాటుకునే దిశగా మాజీ సీఎం ఎంకే స్టాలిన్‌తో పాటూ పలువురు నేతలను కలిసి ఆశీస్సులను సీఎం విజయ్ అందుకోవడం ప్రశంసలకు దారి తీశాయి. ఈ పరిస్థితులలో సభలో రెండవ రోజు స్పీకర్ ఎన్నిక జరిగింది.
ఏకగ్రీవ ఎన్నిక..
శాసనసభ స్పీకర్ పదవికి టీవీకే తరపున థౌజండ్ లైట్స్ ఎమ్మెల్యే జేసీడీ ప్రభాకర్ నామినేషన్ దాఖలు చేశారు. ప్రతిపక్షాల తరపున నుండి ఎవరూ పోటీ చేయకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ప్రకటించారు. స్పీకర్‌గా ఎన్నికై న ప్రభాకర్‌ను సంప్రదాయం ప్రకారం మంత్రి సెంగోట్టయన్ , ప్రధాన ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ కలిసి సభాపతి కుర్చీలో కూర్చోబెట్టారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి విజయ్, మంత్రులు సెంగోట్టయన్, ఆనంద్, అరుణ్‌రాజ్ ఇతర సభ్యులు పాల్గొన్నారు. స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జేసీడీ ప్రభాకర్ తురైయూర్ ఎమ్మెల్యే రవిశంకర్‌ను డిప్యూటీ స్పీకర్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు.
అందర్నీ సమంగా చూడండి..
కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత రాజేష్‌కుమార్, సీపీఎం ఆర్ చెల్ల స్వామి, సీపీఐ తలి రామచంద్రన్, వీసీకే వన్నియరసు, ఐయూఎంఎల్ సయ్యద్ ఫరూక్ భాషాలు స్పీకర్ ఎన్నికకు శుభాకాంక్షలు తెలుపుతూ తొలుత ప్రసంగించారు. వీరంతా ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడంతో వీరు అధికార పక్షం వరుసలో అసెంబ్లీలో కూర్చోవడం విశేషం. అనంతరం ప్రతి పక్షం వరుసలో కూర్చున్న డీఎంకే ఉదయ సూర్యుడి చిహ్నంలో గెలిచిన ఎండీఎంకే టీఎం రాజేంద్రన్, కొంగునాడు మక్కల్ దేశీయ కట్చి కె నిత్యానందన్, మనిదనేయ జననాయగ కట్చి తమీమున్ అన్సారీ, మనిదనేయమక్కల్ కట్చి జవహిరుల్లాలు ప్రసంగించారు. అలాగే డీఎండీకే ప్రేమలత విజయకాంత్, పీఎంకే సౌమ్య అన్బుమణి ప్రసంగించారు.
స్పీకర్‌కు తమ తరపున విన్నపం చేశారు. చిన్న పార్టీలకు మాట్లాడే సమయం అధికంగా కేటాయించాలని కోరారు. అనంతరం అన్నాడీఎంకే తరపున తొలుత ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ప్రసంగిస్తూ స్పీకర్ గతంలో అన్నాడీఎంకేలో ఉన్న సమయంలో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. అదే సమయంలో అన్నాడీఎంకేలో మరో శిబిరంగా ఉన్న ఎస్పీ వేలుమణి తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరడంతో స్పీకర్ అనుమతి ఇవ్వడం విశేషం. ఇక అమ్మమక్కల్ మున్నేట్ర కళగం మన్నార్ కుడి ఎమ్మెల్యే కామరాజ్ తన ప్రసంగంలో టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించడం విశేషం.
కొత్త స్పీకర్‌గా జేసీడీ ప్రభాకర్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో ఉదయనిధి స్టాలిన్ తొలి ప్రసంగం చేశారు. అందరూ పేపర్లో రాసుకొస్తే, ఉదయనిధి ట్యాబ్‌ను ఉపయోగించి, అందులో ముందుగా ఫీడ్ చేసిన మేరకు ప్రసంగాన్ని ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు. అలాగే, విజయ్‌తో తనకున్న సాన్నిహిత్యా న్ని గుర్తు చేసుకుంటూనే, రాజకీయ అనుభవంపై చమత్కరించారు. సీఎం విజయ్ తాను ఒకే కాలేజీలో (లయోలా కాలేజీ) చదువుకున్నామని, అయితే ప్రభుత్వం నడపడంలో డీఎంకే సీనియర్ బ్యాచ్ అని వ్యాఖ్యలు చేశారు. 1967లోనే అధికారంలోకి వచ్చిన చరిత్ర తమది అని తమకు ఉన్న రాజకీయ అనుభవాన్ని, జ్ఞానాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు సూచించారు. దీనిని స్వీకరించడానికి తమరు కూడా సిద్ధంగా ఉండాలని వ్యాఖ్యానించారు. డీఎంకే ఈ సభలో కేవలం విమర్శించే పార్టీగా కాకుండా, రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసే ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటుందని స్పష్టం చేశారు. సీఎం ప్రమాణ స్వీకార వేడుకలో జరిగిన కొన్ని పొరపాట్లను ప్రస్తావిస్తూ.. తమిళనాడులో ఏ కార్యక్రమం జరిగినా ’తమిళ్ తాయ్ వాల్త్తు’కు మొదటి ప్రాధాన్యత ఉండాలని, దానిని రెండో స్థానానికి పంపే ప్రయత్నాలను తాము సహించబోమన్నారు. సీఎం విజయ్ ప్రతిపక్ష నేతలను కలిసి శుభాకాంక్షలు తెలపడాన్ని స్వాగతిస్తూ, ఇదే రాజకీయ నాగరికత సభలోనూ కొనసాగాలని కోరారు. ఈ సభలో అధికార పక్షం, ప్రతిపక్షం అని వేర్వేరు వరుసల్లో కూర్చున్నా.. ప్రజల సమస్యల పరిష్కారం విషయంలో అందరం ముందు వరుసలో నిలబడి పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలను విడదీసే సనాతన ధర్మాన్ని కచ్చితంగా నిర్మూలించాలని కోరారు. తమ మిత్రపక్షాల మద్దతుతో కొత్తగా బాధ్యతలు చేపట్టిన విజయ్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, సభలో మహిళా ఎమ్మెల్యేలు కొత్తగా ఎన్నికై న యువ సభ్యులు అధిక సంఖ్యలో ఉండటంపై హర్షం వ్యక్తం చేశారు.
తమిళనాడు 17వ శాసన సభ స్పీకర్‌గా జేసీడీ ప్రభాకర్ మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిప్యూటీ స్పీకర్‌గా రవి శంకర్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సాగిన వివిధ పార్టీల శాసన సభా పక్ష నేతల ప్రసంగాలన్నీ ఆసక్తికరంగా, స్నేహ పూర్వక పలకరింపుతో సాగాయి. అందరికీ సమాన అవకాశం కల్పించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టగా, సభా నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటానని కొత్త స్పీకర్ వాగ్దానం చేశారు.
ఆసక్తికర కథతో విజయ్ ప్రసంగం
స్పీకర్‌ను కుర్చీ వద్దకు చేయి పట్టుకుని తీసుకెళ్లే సంప్రదాయం ఎందుకు? అన్న విషయంగా సీఎం సీ జోసెఫ్ విజయ్ ఆసక్తికర కథతో తన ప్రసంగం మొదలెట్టారు. భారత పార్లమెంటరీ విధానం బ్రిటన్ నుండి వచ్చిందని గుర్తు చేస్తూ, పూర్వం ఇంగ్లాండ్‌లో రాజుల పాలన ఉండేదన్నారు. రాజు ఏదైనా పని చేయాలని కోరినప్పుడు, పార్లమెంట్ దాన్ని వ్యతిరేకిస్తే.. ఆ వ్యతిరేకతను రాజుకు స్వయంగా చెప్పే ధైర్యం ఎవరికీ ఉండేది కాదన్నారు. పార్లమెంట్ అభిప్రాయాన్ని రాజుకు వినిపించే వ్యక్తిని ’స్పీకర్’ అనేవారు అని గుర్తు చేస్తూ, రాజుకు నచ్చని విషయాన్ని చెప్పినందుకు, కోపంతో రాజు ఆ స్పీకర్‌కు మరణశిక్ష విధించేవాడని పేర్కొంటూ అలా గతంలో చాలా మంది స్పీకర్లు ప్రాణాలు కోల్పోయారని వివరించారు. ఈ భయం కారణంగా, ఆ రోజుల్లో స్పీకర్ పదవికి ఎవరూ ముందుకు వచ్చేవారు కాదన్నారు. ఒకవేళ ఎవరినైనా ఎంపిక చేస్తే, తమ ప్రాణం పోతుందనే భయంతో వారు సభ నుండి పారిపోవడానికి యత్నించేవారని తెలిపారు. అలా పారిపోతున్న వ్యక్తిని సభానాయకుడు, ప్రతిపక్ష నాయకుడు కలిసి పట్టుకుని, బలవంతంగా లాక్కొచ్చి స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టేవారని, కాలక్రమేణా అది ఒక గౌరవప్రదమైన సంప్రదాయంగా మారిందని విజయ్ వివరించారు. ప్రజల కోసం, ప్రజల చేత నడపబడేదే ప్రజాస్వామ్యం అన్న అబ్రహం లింకన్ మాటలను విజయ్ గుర్తుచేశారు. సభలో ఒక్క ఎమ్మెల్యే ఉన్న పార్టీ అయినా, మెజారిటీ ఉన్న తమిళగ వెట్రి కళగం పార్టీ అయినా.. అందరి అభిప్రాయాలకు సమాన గౌరవం ఉంటుందని స్పష్టం చేశారు. సభాపతి జేసీడీ ప్రభాకర్‌కు, డిప్యూటీ స్పీకర్ రవిశంకర్‌కు తమ పార్టీ తరపున పూర్తి సహకారం ఉంటుందని విజయ్ హామీ ఇచ్చారు. ముందుగా తమను అభినందించి శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ డిప్యూటీ స్పీకర్ రవిశంకర్ ధన్యవాదులు తెలియజేశారు. చివరగా స్పీకర్ ప్రభాకర్ మాట్లాడుతూ, దివంగత నేతలు ఎంజీఆర్, జయలలితతో తనకు ఉన్న అనుబంధం, టీఎంసీ నేతమూపనార్‌తో ఉన్న సాన్నిహిత్యంతో పాటూ అన్నాడీఎంకేలో తనకు లభించిన గుర్తింపు గౌరవాన్ని ప్రస్తావించారు. అందరికీ సమాన అవకాశం కల్పిస్తానని, సభా నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటానని స్పష్టం చేశారు. తర్వాత సభ వాయిదా పడింది. బుధవారం విజయ్ తన బలాన్ని చాటుకునే దిశగా విశ్వసపరీక్షకు సిద్ధమయ్యారు. కాగా, స్పీకర్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ మాజీ సీఎం ఎంకే స్టాలిన్ ట్వీట్ చేశారు. అసెంబ్లీలో ప్రజల గొంతుక జ్వలించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.


