నిరంతర తాగునీటి సరఫరాకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

నిరంతర తాగునీటి సరఫరాకు చర్యలు

May 13 2026 12:20 AM | Updated on May 13 2026 12:20 AM

● అధికారులకు సీఎం విజయ్‌ ఆదేశాలు ● నేతలకు కృతజ్ఞతలు

సాక్షి, చైన్నె: సీఎం జోసెఫ్‌ విజయ్‌ అధ్యక్షతన సచివాలయంలో పురపాలక పరిపాలన, తాగునీటి సరఫరా , గ్రామీణాభివృద్ధి శాఖల పనితీరుపై ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. వేసవి కాలంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. చైన్నె కార్పొరేషన్‌ సహా అన్ని జిల్లాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని సూచించారు. అవసరమైన చోట వాటర్‌ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని, కొత్తగా బోరు బావులు తవ్వడం వంటి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు ప్రతి సోమవారం తాగునీటి సరఫరాపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించి, నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. అలాగే రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని, చైన్నె నగరం ఇతర ప్రాంతాలలో కాలువల పూడికతీత పనులను, వరద నివారణ పనులను ఆలస్యం చేయకుండా తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు.ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. ఎం. సాయి కుమార్‌, అదనపు ప్రధాన కార్యదర్శి గగన్‌దీప్‌ సింగ్‌ బేడీ, పురపాలక శాఖ కార్యదర్శి డా. టి. కార్తికేయన్‌, చైన్నె కార్పొరేషన్‌ కమిషనర్‌ జె. కుమరగురుబరన్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం శ్రీలంక నావికాదళం తమిళ జాలర్లను బంఽధీగా పట్టుకెళ్లడంతో వారిని విడుదల చేయించాలని కోరుతూ తొలి లేఖను విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్‌కు సీఎం హోదాలో విజయ్‌ రాశారు. సమీక్ష తదుపరి వివిధ పార్టీల నేతలను కలిసేందుకు విజయ్‌ వెళ్లారు. ముందుగా ఐయూఎంఎల్‌ నేత ఖాదర్‌ మొహిద్దీన్‌తో పాటుగా ఆ పార్టీ వర్గాలను,అనంతరం సత్యమూర్తి భవన్‌లో టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగైతో పాటుగా ఆ పార్టీ నేతలను కలిశారు. అలా గే, వీసీకే నేత తిరుమావళవన్‌ను సైతం కలిశారు.

ఆప్తుడికి పదవి

సీఎంగా బాధ్యతలు చేపట్టిన విజయ్‌ తన ఆప్తుడైన పార్టీ అధికారి ప్రతినిధి రిక్కి రతన్‌ పండిట్‌ వెట్రి వేల్‌కు ప్రభుత్వ పదవి అప్పగించారు. ఆయన్ని సీఎం ప్రత్యేక అధికారిగా నియమించారు. ఈ రతన్‌ పండిట్‌ గత కొన్నేళ్లుగా విజయ్‌తోనే ఉన్నారు. పార్టీ అధికార ప్రతినిధిగానే కాదు, ఆయన మంచి జ్యోతిష్కుడు కావడం గమనార్హం. ఇక పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement