సాక్షి, చైన్నె: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి రాజకీయాల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతోంది. ఎన్‌ఆర్ కాంగ్రెస్, బీజేపీ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి సర్వం సిద్ధం చేశారు. బుధవారం పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా రంగస్వామి 5వ సారిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటుగా ఐదుగురు మంత్రులు బాధ్యతలు స్వీకరించనున్నారు. పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఎన్‌ఆర్ కాంగ్రెస్, బీజేపీ, అన్నాడీఎంకే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కూటమి ఎమ్మెల్యేల మద్దతుతో ఎన్‌ఆర్ కాంగ్రెస్ అధినేత రంగస్వామి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. దీంతో బుధవారం ఉదయం 9.45 గంటలకు పుదుచ్చేరిలోని స్వర్ణ మందిరంలో ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు చేశారు. గవర్నర్ కై లాసనాథన్, రంగస్వామితో పాటుగా ఐదుగురు మంత్రులతో పదవీ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
కొత్త మంత్రివర్గం : ముఖ్యమంత్రి రంగస్వామి సీఎంగా, నమశ్శివాయం (బీజేపీ), మల్లాడి కృష్ణారావు(ఎన్‌ఆర్‌కాంగ్రెస్), రాజవేలు (ఎన్‌ఆర్ కాంగ్రెస్) , జి.ఎన్.ఎస్. రాజశేఖరన్ (బీజేపీ – కారైకాల్), డాక్టర్ నారాయణస్వామి (ఎన్‌ఆర్ కాంగ్రెస్)లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రంగస్వామి పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇది 5వ సారి కావడం గమనార్హం. గతంలో 2001, 2006, 2011, 2021లలో సీఎంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఎన్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ స్పీకర్ శివకొళుందు స్పీకర్‌గా ఎన్నికయ్యే అవకాశం ఉండగా, డిప్యూటీ స్పీకర్ పదవిని బీజేపీకి కేటాయించనున్నారు. మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంపై అన్నాడీఎంకే అసంతృప్తి వ్యక్తంచేస్తోంది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ తదితరులు హాజరు కానున్నారు.


