జోరుగా తచ్చూర్– చిత్తూరు సిక్స్‌లేన్ల రోడ్డు మొదటి దశలో 92 కిమీ నిర్మాణ పనులు పూర్తి డిసెంబర్ నాటికి మిగిలిన పనులు పూర్తి
తిరువళ్లూరు: పొరుగు రాష్ట్రాల నుంచి చైన్నెలోని ఎన్నూర్ కామరాజర్ పోర్టు, కాట్టుపళ్లిలోని ప్రైవేటు పోర్టులకు సరుకు రవాణా రాకపోకలను సులభతరం చేయడానికి నిర్మిస్తున్న రహదారి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మొదటి దశ పనులు(చిత్తూరు నుంచి ఊత్తుకోట వరకు) పూర్తయిన క్రమంలో రెండవ దశ పనులను(ఊత్తుకోట పోందవాక్కం నుంచి తచ్చూరు వరకు) పనులను సైతం వేగంగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని అధికారులు నిర్ణయించి పనులను వేగంగా నిర్వహిస్తున్నారు. ఆంధ్ర, బెంగళూరు తదితర రాష్ట్రాల నుంచి చైన్నెలోని పోర్టులకు సరుకు రవాణాను సులభతరం చేయాలన్న ఉద్దేశంతో తిరువళ్లూరు జిల్లా తచ్చూరు నుంచి చిత్తూరు వరకు సుమారు 133 కిమీ సిక్స్‌లేన్ల రహదారి నిర్మాణపు పనులను భారత జాతీయ రహదారుల అఽథారిటీ (ఎన్‌హెచ్‌ఎఐ) ద్వారా 5486 కోట్లు రూపాయల వ్యయంతో చేపట్టారు. మొదటి దశలో చిత్తూరు నుంచి పోందవాక్కం వరకు సుమారు 92 కిమీ మేరకు పనులను పూర్తి చేశారు. రోడ్డులో 24 గంటలూ పనిచేసే 120 నిఘా కెమెరాలు, 86 ప్రాంతాల్లో అత్యవసర సేవల కోసం రోడ్‌సైడ్ టెలిఫోన్‌లను సైతం ఏర్పాటు చేశారు. స్పీడ్ పరిమితులను గుర్తించే హైటెక్ కెమెరాలు, భద్రతకు సంబంధించిన ఎల్‌ఈడీ స్క్రీన్‌లను సైతం అందుబాటులోకి తెచ్చారు. దీంతో పాటు రోడ్డుకు మద్యలో సెంటర్ మీడియన్‌తో పాటు 80 చెట్లను నాటి వాటిని పెంచడానికి సోలార్‌తో పని చేసే మోటార్లును అమర్చి బిందుసేద్యం సదుపాయంతో నీటిని సైతం అందించడానికి చర్యలు చేపట్టారు. ఈ రహదారిలో 24 పెద్ద బ్రిడ్జిలు, 17 చిన్నపాటి బ్రిడ్జిలు, 16 ప్రాంతాల్లో రహదారికి దిగువన వాహన ప్రవేశం, 39 చిన్నపాటి లెవల్ క్రాసింగ్‌లు, 7 ప్రాంతాల్లో వాహనాల మళ్లింపు సదుపాయం, 4 ప్రాంతాల్లో రైల్వే లెవల్ క్రాసింగ్‌లతో సహా మొత్తం 112 రోడ్డు క్రాసింగ్‌లను ఏర్పాటు చేశారు. వీటితో పాటు ప్రతి 25 కిమీ దూరంలో తాగునీటి సదుపాయం, పెట్రోల్‌బంక్‌లు, టీదుకాణాలు, రెస్టారెంట్‌లు, మరుగుదొడ్లు, విశ్రాంతి గదులను సైతం ఏర్పాటు చేసినట్టు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు వివరించారు.
టోల్ రేట్లు వివరాలు
మొదటి దశలో పనులు పూర్తయిన క్రమంలో టోల్‌గేట్ ఫీజుల వివరాలను సైతం ఏర్పాటు చేశారు. చిత్తూరు నుంచి తచ్చూర్ వరకు 116 కిమీ దూరంలో ఒకసారి ప్రయాణం సాగించడానికి కారుకు 285 రూపాయలు, ఊత్తుకోట వరకు 210 రూపాయలు, బస్సులు, చిన్నపాటి సరుకు వాహనాలకు 350 రూపాయలు, ట్రాక్టర్, ట్రావెల్స్ వాహనాలకు 735 రూపాయలు, 3 యాక్సిల్ వాహనాలకు 800 రూపాయలు, నాలుగు నుంచి ఆరు యాక్సిల్ వాహనాలకు 1155 రూపాయలు, ఏడు అంతకంటే ఎక్కువ వున్న యాక్సిల్ వాహనాలకు 1405 రూపాయలుగా నిర్ధారించారు. రెండవ దశ పనులను సైతం డిసంబర్ నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తేవడానికి హెచ్‌ఎన్‌ఏఐ అఽధికారులు చర్యలు చేపట్టారు. దీంతో పాటు ఊత్తుకోట–తిరువళ్లూరు(ఎస్‌హెచ్–50) రోడ్డును సైతం అనుసంధానం చేయనున్నారు.


