పొల్లాచ్చి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

పొల్లాచ్చి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

May 13 2026 12:20 AM | Updated on May 13 2026 12:20 AM

● లారీ–కారు ఢీకొని దంపతుల సహా నలుగురి మృతి

సాక్షి, చైన్నె: కోవై జిల్లా పొల్లాచ్చి సమీపంలోని నెగమం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. సేలం జిల్లా కాడయాంబట్టికి చెందిన ధనపాల్‌(37), ఆయన భార్య మేనక(35), కుమార్తె కనిష్క(17), కుమారుడు సుర్జిత్‌(12) బంధువు స్నేహ(23)తో కలిసి వాల్‌పారైకి విహారయాత్రకు వెళ్లారు. తిరిగి సొంత ఊరికి కారులో సోమవారం సాయంత్రం బయలుదేరారు. పొల్లాచ్చి నుండి పల్లడం వైపు వెళ్తుండగా, నెగమం సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ నియంత్రణ కోల్పోయి వీరి కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ధనపాల్‌, మేనక, స్నేహ అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన కనిష్క, సుర్జిత్‌లను పొల్లాచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా కనిష్క ప్రాణాలు విడిచింది. ప్రస్తుతం సుర్జిత్‌ (12) కోవై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న పొల్లాచ్చి డీఎస్పీ నవీన్‌ కుమార్‌ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కృష్ణగిరికి చెందిన లారీ డ్రైవర్‌ శరవణన్‌ను అరెస్ట్‌ చేశారు. మృదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సీఎం విజయ్‌ మృతుల కుటుంబాలకు తన సానుభూతి తెలియజేశారు. మృతులకు తలా రూ.3 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు సుర్జిత్‌ కు రూ.లక్ష సహాయాన్ని ప్రకటించారు. గాయపడిన బాలుడికి మెరుగైన, ప్రత్యేక చికిత్స అందించాలని ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement