చెల్లించిన భక్తులు
తవణంపల్లె: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అర్ధగిరి శ్రీ వీరాంజనేయస్వామి దేవస్థానంలో మంగళవారం హనుమాన్ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామి వారికి అభిషేకం, ప్రత్యేక అలంకరణ, పూజలు నిర్వహించి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ఇక, జిల్లా ఎస్పీ తుషార్‌డూడి, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, కాణిపాకం ట్రస్టుబోర్డు చైర్మన్ మణినాయుడు, కాణిపాకం ఈఓ పెంచల కిషోర్ ఆధ్వర్యంలో స్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు. వీరికి అర్ధగిరి చైర్మన్ రఘుపతి, ఈఓ మునిశేఖర్, ట్రస్టుబోర్డు సభ్యులు, అర్చకులు పూర్ణకుంభంతో, కేరళడ్రమ్ముల వాయిద్యాలతో ఘనస్వాగతం పలికారు. జిల్లా ఎస్పీ తుషార్‌డూడి, ఎమ్మెల్యే మురళీమోహన్, కాణిపాకం ఆలయ అధికారులు స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. అనంతరం ఎస్పీ, ఎమ్మెల్యేను ఆలయ అధికారులు శేషవస్త్రాలతో సత్కరించి, స్వామివారి తీర్థప్రసాదాలు, సంజీవరాయ పుష్కరిణి తీర్థాలను అందజేశారు.
భక్తిశ్రద్ధలతో సహస్రనామ హోమం
ఆలయ అర్చకులు సహస్రనామ హోమాన్ని భక్తిప్రపత్తులతో నిర్వహించారు. హోమంలో ట్రస్టుబోర్డు చైర్మన్ కుటుంబ సభ్యులు, ట్రస్టు సభ్యులు, ఉభయదారులు, భక్తులు పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో ఆంజనేయస్వామి భక్తులు ప్రదక్షిణగా వచ్చి ఇరుముడులు చెల్లించారు. అలాగే పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. రాత్రి స్వామివారికి ప్రాకారోత్సవం నిర్వహించారు. పల్లకిలో కొలువుదీరి భక్తులను కనువిందు చేశారు. అనంతరం అష్టావధాని మురళి, ఆస్థాన కవి దయానందరెడ్డి, తెలుగు పండితులు భాస్కర్ రెడ్డి కీర్తనలు ఆలపించారు.


