ఓ భావోద్వేగం | - | Sakshi
Sakshi News home page

ఓ భావోద్వేగం

May 1 2026 5:45 AM | Updated on May 1 2026 5:45 AM

● నేడు చివరి ఘట్టం ● మదురైకు అళగర్‌ స్వామి ● నేడు వైగై నదీప్రవేశం

మదురైఉత్సవం

సాక్షి, చైన్నె : మదురై చిత్రై తిరువిళా( ఉత్సవం)అన్న కేవలం ఆధ్యాత్మికం మాత్రమే కాదు... అదో భావోద్వేగం. మండూ వేసవిలో మదురై నగరం 15 రోజుల పాటు పండుగ వాతావరణంలో మునిగిపోయింది. ఆధునిక కాలంలో షాపింగ్‌ మాల్స్‌, మల్టీప్లెక్స్‌లు, గేమింగ్‌ సెంటర్లు ఎన్ని వచ్చినా, మదురై చిత్తిరై తిరువిళా క్రేజ్‌ మాత్రం అస్సలు తగ్గలేదు. మదురై వాసులకు ఇది కేవలం ఒక ఉత్సవం కాదు, వారి భాషలో చెప్పాలంటే ‘అదొక ఎమోషన్‌‘ అని ఆధ్యాత్మిక వేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు.

నేడే ముఖ్య ఘట్టం

మీనాక్షి అమ్మన్‌ సన్నిధిలో పట్టాభిషేకం, దిగ్విజయం, కల్యాణోత్సవం, రథోత్సవం అంగరంగ వైభంగా పూర్తి అయ్యాయి. చివరి రోజున గురువారం తీర్థవారి అత్యంత వేడుకగా జరిగింది. మీనాక్షి అమ్మవారి సన్నిధిలో ఉత్సవం ముగిసినా, మదురై ఉత్సవంలో మున్ముందు రోజులు మరిన్ని ముఖ్య ఘట్టాలు జరగనున్నాయి. అళగర్‌ వైగై నదీ ప్రవేశం, మండూక మునికి శాప విమోచనం . దశావతార ఉత్సవం అంటూ కనుల పండువగా సేవలు జరగనున్నాయి. శుక్రవారం జరిగే వైగై నదీ ప్రవేశం నిమిత్తం బుధవారం సాయంతం అళగర్‌ మలై నుంచి బయలు దేరిన స్వామి వారికి రాత్రంతా భక్త జనం దారి పొడవున ఆహ్వానం పలికారు. మతాలకు అతీతంగా అళగర్‌ స్వామికి నీరాజనాలు పలికారు. మూన్రుమావడి వద్ద భక్తులు స్వామివారికి ఘనంగా ’ఎదిర్‌ సేవ’ నిర్వహించారు. రాత్రి 8.30 గంటలకు స్వామి తల్లాకుళం ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు. అదే సమయంలో శ్రీ విళ్లిపుత్తూరు నుంచి ఆండాల్‌ అమ్మవారు ధరించిన మాలలను ఇక్కడకు తీసుకు వచ్చారు. అలాగే పట్టువస్త్రాలు, చిలుక మదురైకి చేరుకున్నాయి. సంప్రదాయం ప్రకారం, వైగై నదిలోకి దిగే ముందు కల్లాళగర్‌ ఈ మాలలను ధరిస్తారు. తిరుమల బ్రహ్మోత్సవాలు, శ్రీరంగం ఉత్సవాల మాదిరిగానే మదురైలో కూడా ఆండాళ్‌ అమ్మవారి మాలను పెరుమాళ్‌ ధరించడం ఒక పవిత్ర ఆచారంగా జరుగుతున్నది. శుక్రవారం తెల్లవారుజామున 5.35 నుండి 5.55 గంటల మధ్య బంగారు గురప్రు వాహనంపై కల్లాళగర్‌ వైగై నదిలోకి దిగుతారు. ఈ అద్భుత ఘట్టాన్ని చూడటానికి లక్షలాది మంది భక్తులు మదురైకు చేరుకుంటున్నారు.

హైకోర్టు కీలక ఆదేశాలు

ఉత్సవాల సమయంలో కొందరు అల్లరి మూకలు భక్తులపై చెప్పులు విసరడం వంటి అనాగరిక పనులకు పాల్పడుతున్నట్లు వచ్చిన పిటిషన్‌పై మదురై హైకోర్టు స్పందించింది: భక్తులపై చెప్పులు విసరడం లేదా అసభ్యంగా ప్రవర్తించడం వంటి పనులు చేసే వారిని తక్షణమే అరెస్ట్‌ చేయాలని పోలీసులను ఆదేశించింది. ఉత్సవ ప్రాంతం చుట్టూ 7 కిలోమీటర్ల మేర సాయుధ బలగాలు నిరంతరం పహారా కాయాలని, సుమారు 3000 మంది పోలీసులు రక్షణగా ఉండాలని కోర్టు స్పష్టం చేసింది.

సంస్కృతి – సామరస్యం

ఈ పండుగ కేవలం హిందువులకు మాత్రమే పరిమితం కాదు. మదురైలోని ముస్లిం సోదరులు కూడా అళగర్‌ స్వామిని సాదరంగా ఆహ్వానిస్తారు. విల్లాపురంలో ఇస్లాం మతస్థులు అళగర్‌ కోసం వేచి ఉండడం మత సామరస్యానికి నిదర్శనం. అదేవిధంగా, గోరిపాళయం దర్గా ఉత్సవాల్లోనూ, చర్చి ఊరేగింపుల్లోనూ హిందువులు పాల్గొనడం మదురై ప్రత్యేకత. ఈ ఉత్సవాల సమయంలో మదురైలో ఎవరి ఇంట్లోనూ వంట చేయాల్సిన అవసరం ఉండదు. వీధి వీధినా పానకం, రోజ్‌ మిల్క్‌, పొంగల్‌, వడ వంటి ప్రసాదాలు, అన్నదానాలు నిరంతరం జరుగుతూనే వచ్చారు. పిల్లలకు మురుగన్‌, మీనాక్షి, కరుప్పుసామి వేషాలు వేసి తల్లిదండ్రులు మొక్కులు తీర్చుకున్నారు. మదురై చిత్తిరై తిరువిళా అనేది తమిళ గడ్డపై ఆధ్యాత్మికత, సంస్కృతి, మనుషుల మధ్య ఉన్న అనుబంధాన్ని చాటిచెప్పే ఒక అద్భుతమైన జీవన అనుభవం. పాఠశాల సెలవుల్లో వచ్చే ఈ పండుగ, మదురై ప్రజలకు కొత్త ఉత్సాహాన్ని, నమ్మకాన్ని ఏటా అందిస్తూనే ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement