ముఖ్య నేతలతో భేటీ
మారుతున్న సమీకరణాలపై చర్చ
కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నాయకులకు సూచనలు
ఎగ్జిట్ పోల్స్ గందరగోళం నేపథ్యంలో డీఎంకే అధ్యక్షుడు , సీఎం ఎంకే స్టాలిన్ అలెర్ట్ అయ్యారు. కొన్ని సర్వేలు పూర్తిగా తమకు, మరికొన్ని సర్వేలు అన్నాడీఎంకేకు, ఇంకో
రెండు సర్వేలు కొత్తగా ఆవిర్భవించిన విజయ్ పార్టీదే అధికారం అన్నట్టుగా సర్వే
వివరాలను ప్రకటించాయి. దీంతో కౌంటింగ్ రోజున ప్రతి ఏజెంట్, ప్రతి అభ్యర్థి, మరింత జాగ్రత్తలతో అప్రమత్తంగా వ్యవహరించాలని నాయకులకు, కార్యకర్తలకు స్టాలిన్ సూచించారు.
సాక్షి, చైన్నె : సాధారణంగా ఎగ్జిట్ పోల్స్ ఏదో ఒక పార్టీవైపు మొగ్గుచూపుతాయి. కానీ ఈసారి ఎగ్జిట్‌పోల్ అంచనాలు ఎవరికీ అంతుచిక్కని విధంగా ఉన్నాయని చెప్పవచ్చు. కొన్ని సర్వేలు అధికార డీఎంకే కూటమికి స్పష్టమైన ఆధిక్యం ఇస్తుంటే, మరికొన్ని సర్వేలు విజయ్ టీవీకే రాకతో భారీగా ఓట్ల చీలిక జరిగినట్టు ప్రకటించాయి. గతంలో ఉన్న కేవలం డీఎంకే, అన్నాడీఎంకే మధ్యే పోటీ అన్న పరిస్థితి మారి, విజయ్ ఎంట్రీతో ముక్కోణపు సమరాన్ని తలపిస్తున్నాయి. దీంతో తుది ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.
మహిళలు – యువత ఓట్లపై ఆరా
ప్రభుత్వం అందించిన మహిళా స్వయం సహాయక నిధి, మగళీర్ ఉరిమై తిట్టం, విడియల్ పయనం వంటి పథకాలు మహిళా ఓటర్లను ఆకర్షించాయా? లేక మార్పు కోరుతూ యువత విజయ్ వైపు మొగ్గు చూపారా? అనే అంశంపై తీవ్రంగా విశ్లేషించినట్టు సమాచారాలు వెలువడ్డాయి. అలాగే యువతకు అందిస్తున్న పుదుమై పెన్, తమిళ్‌పుదల్వన్, ఉలగం వున్ కయ్యిల్, నాన్ మొదల్వన్ వంటి పథకాలతో లబ్ది పొందిన వారు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారా? లేదా మార్పు అన్న అంశాన్ని ప్రధానంగా తీసుకున్నారా? అన్న విషయంపై సుదీర్ఘ చర్చ జరిగినట్టు సమాచారం. ఇక, ఉత్తర తమిళనాడులో పీఎంకే, దక్షిణ తమిళనాడులో కుల సమీకరణలు, పశ్చిమ తమిళనాడు(కొంగు మండలం)లో పరిస్థితులను గురించి రీజినల్ ఇన్‌చార్జ్‌ల నుంచి సమాచారం సేకరించి, ఇక్కడ అన్నాడీఎంకే పట్టు ఈసారి సందిగ్ధమే ఉన్నట్లుగా పరిశీలనలో తేలిందని సమాచారం. చివరగా ఎన్ని గందరగోళాలు సృష్టించినా, అనుకూల, ప్రతికూల పోల్స్ వచ్చినా, అసలైన తీర్పు మాత్రం ఈవీఎంలలో ఉన్నట్టు, కౌంటింగ్ రోజున అప్రమత్తంగా వ్యవహరించని పక్షంలో నష్టం తప్పదని, జాగ్రత్తగా వ్యవహరించాలని నేతలకు స్టాలిన్ స్పష్టమైన హెచ్చరికలు చేసినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అదే సమయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ మంత్రి దురై మురుగన్ స్పందిస్తూ, డీఎంకే గెలుపు ప్రకాశవంతంగా ఉందని, ఉదయ సూర్యుడికే ప్రజలు పట్టం కట్టారని, అధికారం తమదే అని ధీమా వ్యక్తంచేయడం విశేషం. డీఎంకే సంపూర్ణ మెజారిటీతో గెలుస్తుందని సీనియర్ నేత ఆర్‌ఎస్ భారతీ ధీమా వ్యక్తం చేశారు. ఇక డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ సైతం స్టాలిన్‌తో భేటీ అయ్యారు.
ఎగ్జిట్ పోల్స్ ముగిసిన వెంటనే స్టాలిన్ తన పార్టీకి చెందిన ముఖ్య నేతలు, సీనియర్ మంత్రులు ,ఎన్నికల వ్యూహకర్తలతో భేటీ అయ్యారు. పార్టీ ప్రధాన కార్యదర్శి దురై మురుగన్, సీనియర్ మంత్రులు ఎంఆర్‌కే పన్నీరు సెల్వం, వేలు, పెరియకరుప్పన్, ముతుతస్వామి, మెయ్యనాథన్, మాజీ మంత్రి సెంథిల్ బాలాజీలు, ఆర్‌ఎస్ భారతీ, టీకేఎస్ ఇలంగోవన్ వంటి నేతలు ఈ భేటీలో ఉన్నారు. ఇందులో ప్రధానంగా ఓటింగ్ శాతం గురించి, చీలిక గురించి సుదీర్గ చర్చ జరిగినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఓట్ల లెక్కింపు రోజునకు సంబంధించిన వ్యూహాలకు పదునుపెట్టారు. మే 4న ఓట్ల లెక్కింపు సమయంలో అనుసరించాల్సిన జాగ్రత్తలు , ఏజెంట్లుగా నియమితులైన వారి గురించి ఆరా తీశారు. ప్రధానంగా కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, వీసీకే , డీఎండీకే తదితర కూటమి పార్టీల ఓట్లు డీఎంకేకు అనుకూలంగా పడ్డాయా..లేదా అన్న అంశం గురించి క్షేత్రస్థాయి నుంచి నివేదికలను తెప్పించుకుని మరీ స్టాలిన్ పరిశీలించినట్టు పార్టీ నేత ఒకరు పేర్కొన్నారు.


