సాక్షి, చైన్నె : అధికార పగ్గాలు చేపట్టే విషయంలో సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నప్పటికీ సినీ నటుడు, టీవీకే అధినేత విజయ్ అసెంబ్లీకి వెళ్లడం ఖాయం అన్న సంకేతాలు వెలువడ్డాయి. తిరుచ్చి ఈస్ట్‌లో ఆయన హోరా హోరీ సమరం ఎదుర్కొంటున్నప్పటికీ, చైన్నె పెరంబూరు ఓటర్లు ఆయనపై కరుణ చూపించినట్టు తాజా పరిశీలనలో తేలింది. ఎగ్జిట్ పోల్స్ రూపంలో తాజ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు షాక్ ఇస్తూ, ఒక బలమైన రాజకీయ శక్తిగా అవతరించే దిశగా విజయ్ అడుగులు సాగుతున్నాయి. ఈ పరిస్థితులలో విజయ్ రెండు చోట్ల పోటీ చేస్తున్న దృష్ట్యా, ఆయన ఎక్కడ విజయం సాధిస్తారో అన్న ఉత్కంఠ నెలకొంది.
తిరుచ్చి (ఈస్ట్)లో ఊగిసలాట
ఈ వీఐపీ నియోజకవర్గంలో డీఎంకే అభ్యర్థి ఇనిగో ఇరుదయరాజ్ టీవీకే అధినేత విజయ్ మధ్య పోటీ నువ్వా–నేనా అన్నట్లు ఉంది. డీఎంకే (ఇనిగో ఇరుదయరాజ్): 36శాతం, టీవీకే (జోసెఫ్ విజయ్) 35శాతం. అన్నాడీఎంకే (రాజశేఖరన్) 25శాతం, నామ్ తమిళర్ కట్చి (కృష్ణసామి) 4శాతం ఓట్లతో హోరా హోరీ సమరంలో ఉన్నట్టు తాజా పరిశీలనలో తేలింది. డీఎంకే , టీవీకే మధ్య కేవలం ఒక శాతం ఓట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. విజయ్ రాకతో డీఎంకే ఓటు బ్యాంకులో భారీ చీలిక ఏర్పడింది. ఆఖరి నిమిషంలో ఓట్ల మార్పిడి జరిగితే విజయ్ ఇక్కడ విజయం సాధించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
టీవీకే కోటగా పెరంబూరు మారేనా..?
చైన్నెలోని పెరంబూరులో విజయ్ ఆధిక్యంలో ఉన్నట్లు సర్వే వెల్లడించింది. ఇక్కడ డీఎంకేకు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. టీవీకే (జోసెఫ్ విజయ్): 46శాతం, డీఎంకే ( ఆర్‌డీ శేఖర్): 40శాతం, అన్నాడీఎంకే కూటమిలోపీఎంకే (తిలకభామ)10 శాతం మేరకు, నామ్ తమిళర్ కట్చి (వెట్రి తమిళన్) 4శాతం ఓట్లు పొందే అవకాశం ఉందని తేలింది. పెరంబూరులో విజయ్ 6 శాతం ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. ఇక్కడి యువత , కార్మిక వర్గాల్లో విజయ్‌కు ఉన్న క్రేజ్ ఈ ఫలితాల్లో ప్రతిబింబిస్తోంది. మొత్తంగా చూస్తే విజయ్ పార్టీ ప్రధానంగా అన్నాడీఎంకే ఓటు బ్యాంకును తిరుచ్చి, పెరంబూరులో భారీగా దెబ్బతీస్తున్నట్టు స్పష్టం అవుతోంది.
అభ్యర్థులకు మార్గదర్శకాలు
విజయ్ రూపంలో భారీగా ఓట్ల చీలిక జరిగినట్టు అనేక సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే, యాక్సిస్ మై ఇండియాతో సహా మరికొన్ని స్థానిక సర్వే సంస్థలు, సామాజిక మాధ్యమాలలో విజయ్ నేతృత్వంలోనే ప్రభుత్వం అని స్పష్టం చేశాయి. దీవంతో చైన్నె పనయూరులో ఓట్ల లెక్కింపుపై అభ్యర్థులకు విజయ్ దిశానిర్దేశంతో కీలక సూచనలు చేయడం గమనార్హం. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్. ఆనంద్, వివిధ నియోజకవర్గాల అభ్యర్థులు, ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఉత్సాహభరిత వాతావరణం
కొన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు టీవీకే కూటమికి అనుకూలంగా ఫలితాలు రావచ్చని (ఉదాహరణకు ఇండియా టుడే – యాక్సిస్ మై ఇండియా అంచనాలు) పేర్కొనడంతో అభ్యర్థులు ఎంతో ఉత్సాహంగా కనిపించారు. విజయ్ అభ్యర్థులతో నేరుగా మాట్లాడుతూ, ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఎలా వ్యవహరించాలో పలు సూచనలు చేశారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన క్షణం నుండి తుది ఫలితం ప్రకటించే వరకు లెక్కింపు కేంద్రం లోనే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లకూడదని ఆదేశించారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఏవైనా సందేహాలు కలిగినా లేదా అవకతవకలు జరుగుతున్నాయని అనిపించినా, వెంటనే అక్కడి ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవాలని, అందరూ నమ్మకంతో ఉండండి. విజయం ఖాయం అని విజయ్ అభ్యర్థుల్లో ధైర్యాన్ని నింపినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, విజయ్ ఓట్ల లెక్కింపు రోజున తమిళనాట విజిల్ విప్లవం సృష్టించనున్నారని , విజయం ఖాయం. అధికారం ఖాయం అని ఆ పార్టీ కన్వీనర్ సెంగొట్టయన్ ధీమా వ్యక్తం చేశారు.


