సాక్షి ,చైన్నె: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఇండియనన్ బ్యాంక్ ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం 2025–26 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో రూ.3,103 కోట్ల నికర లాభాలతో 5 శాతం వద్ధిని సాధించిందని ఆ బ్యాంక్ సీఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బినోద్ కుమార్ తెలిపారు.ఈ మేరకు చైన్నె ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న ఇండియన్ బ్యాంక్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో 2025–26 ఆర్ధిక సంవత్సరం క్యూ4 ఫలితాలును బినోద్ కుమార్ వెల్లడిస్తూ.. గతేడాది ఇదే సమయంలో రూ. 2,956 కోట్లుగా నమోదయ్యింది.ఈ ఏడాది రూ.3,103 కోట్లకు చేరుకుందన్నారు. గడిచిన క్యూ4లో రిటైల్ వ్యాపారం 18.72 శాతం పెరిగి రూ. 1,41, 396 కోట్లకు చేరిందన్నారు. మొండి బకాయిలు 1.98 శాతానికి తగ్గి ఆస్తుల నాణ్యత మెరుగు పడటం తో పాటు, బ్యాంక్ తన వాటాదారులకు ప్రతి షేరుకు రూ. 18.25 డివిడెండ్‌ను ప్రకటించిందన్నారు. మరో వైపు భవిష్యత్తు అవసరాల కోసం రూ. 5,000 కోట్ల నిధుల సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపిందని వెల్లడించారు.
సాత్తాంకుళం కేసులో
అప్పీల్‌కు అవకాశం
సాక్షి, చైన్నె : తూత్తుకుడి జిల్లా సాత్తాంకుళం తండ్రీ కుమారులైన జయరాజ్, బెన్నిక్స్‌ల హత్య కేసులో మరణశిక్ష పడిన 9 మంది పోలీసులు జూన్ 1వ తేదీలోగా తమ అప్పీల్ పిటిషన్లను దాఖలు చేసుకోవచ్చని మదురై హైకోర్టు బెంచ్ ఆదేశించింది. 2020లో కరోనా లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించారనే కారణంతో సాత్తాంకుళం పోలీసులు జయరాజ్ , ఆయన కుమారుడు బెన్నిక్స్‌లను విచారణకు తీసుకెళ్లారు. పోలీసు కస్టడీలో వారిద్దరూ తీవ్ర హింసకు గురై మరణించారు. ఈ కేసును విచారించిన మదురై జిల్లా కోర్టు, ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ సహా 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ మరణశిక్షను ధ్రువీకరించాలని తమిళనాడు ప్రభుత్వం, సీబీఐ దాఖలు చేసిన పిటిషన్లు గురువారం జస్టిస్ ఆనంద్ వెంకటేష్, జస్టిస్ రామకృష్ణన్ బెంచ్ ముందు విచారణకు వచ్చాయి. జైలులో ఉన్న 9 మంది నిందితులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణకు హాజరయ్యారు. ప్రధాన నిందితుడైన మాజీ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, అప్పీల్ పిటిషన్ సిద్ధం చేయడానికి 15 రోజులు పెరోల్ కావాలని కోరారు. అయితే జైలులో అన్ని సౌకర్యాలు ఉన్నాయని పేర్కొంటూ న్యాయమూర్తులు ఈ అభ్యర్థనను తిరస్కరించారు. నిందితులు తమ అప్పీల్ పిటిషన్లను జూన్ 1 లోగా సమర్పించేందుకు అవకాశం కల్పించారు. జూన్ 4 నుండి ఈ కేసుపై రోజూ విచారణ జరిపి త్వరగా తీర్పు వెలువరిస్తామని న్యామూర్తులు తెలిపారు. అలాగే సీబీఐ దాఖలు చేసిన అప్పీల్ కాపీలను నిందితులకు అందించాలని రిజిస్ట్రార్‌ను కోర్టు ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఈ కేసు సంచలనం కలిగించిన విషయం తెలిసిందే.
పార్సిల్ ఆదాయంలో
చైన్నె రైల్వే రికార్డు
సాక్షి,చైన్నె : దక్షిణ రైల్వేకు చెందిన చైన్నె డివిజన్ 2025–26 ఆర్థిక సంవత్సరంలో పార్సిల్ సేవల ద్వారా భారీ ఆదాయాన్ని ఆర్జించి సరికొత్త మైలురాయిని చేరుకుంది. ఈ మేరకు గురువారం ప్రకటించారు.నిర్దేశించిన వార్షిక లక్ష్యం రూ. 74.22 కోట్లు కాగా, దానినిమించి రూ 74.56 కోట్ల ఆదాయాన్ని సాధించినట్టు వివరించారు. గత ఆర్థిక సంవత్సరం ఆదాయం రూ.70.68 కోట్లతో పోలిస్తే ఇది గణనీయమైన వృద్ధిగా వివరించారు. భారత రైల్వే చరిత్రలో మొదటిసారిగా బి.సి.ఎన్ వ్యాగన్లను పార్సిల్ రవాణా కోసం డీమ్డ్ వి.పిగా మార్చి చైన్నె డివిజన్ రికార్డు సృష్టించిందన్నారు. ఏప్రిల్ 2025లో కొరుక్కుపేట, తాంబరం నుండి టాటా నగర్, రుద్రాపూర్ వంటి నగరాలకు 1,288 టన్నుల టైర్లను మూడు ప్రత్యేక రైళ్ల ద్వారా విజయవంతంగా తరలించినట్టు వివరించారు. ఈ ఏడాది 40 ఎస్.ఎల్.ఆర్ , 3 వి.పి కోచ్‌లను లీజుకు ఇచ్చినట్టు, ఇందులో 20 కొత్త ఎస్.ఎల్.ఆర్ ఒప్పందాలు ఉన్నాయని పేర్కొన్నారు. చైన్నె సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో పార్సిల్ ఆఫీస్ ఆధునీకరణకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని, ముండియంబాక్కం, రాయపురం, తడ స్టేషన్లలో పార్సిల్ టెర్మినల్స్ అభివృద్ధి కోసం కొత్త పనులు ప్రారంభించనున్నామని తెలిపారు.


