సాక్షి, చైన్నె: ఎన్నికల పోలింగ్ సరళిపై విడుదలవుతున్న ఎగ్జిట్ పోల్స్ తప్పుడు ప్రచారాలని, వీటిని చూసి కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి భరోసా ఇచ్చారు. ఈ మేరకు కేడర్‌కు గురువారం సాయంత్రం తన సందేశాన్ని ప్రకటన రూపంలో విడుదల చేశారు.
కుట్రపూరిత ప్రచారం
డీఎంకే పార్టీ కావాలనే కొన్ని సంస్థల ద్వారా తమకు అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయిసున్నదని పళనిస్వామి ఆరోపించారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి పార్టీ శ్రేణులను నైతికంగా దెబ్బతీయడానికి డీఎంకే పన్నే కుట్రలో ఇది భాగమని ఆయన విమర్శించారు.
చారిత్రక విజయాలు
గతంలో 2011, 2016 ఎన్నికల సమయంలో కూడా ఎగ్జిట్ పోల్స్ అన్నీ అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా వచ్చాయని, అయితే, అప్పుడు అమ్మ (జయలలిత) నాయకత్వంలో ఆ అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ ఘనవిజయం సాధించామన్న విషయాన్ని గుర్తెరగాలని సూచించారు. ఈసారి కూడా అదే చరిత్ర పునరావృతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
డీఎంకే అరాచకాలపై నిఘా:
ఓడిపోతామని స్టాలిన్‌కు అర్థమైపోయిందని, అందుకే కౌంటింగ్ సమయంలో గందరగోళం సృష్టించి అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని పళనిస్వామి హెచ్చరించారు. అందుకే కార్యకర్తలు చివరి నిమిషం వరకు లెక్కింపు కేంద్రాల వద్దే ఉండి విజయాన్ని కాపాడుకోవాలని కోరారు. ‘రేపు మనదే.. తమిళనాడు మనదే.. ప్రజల సంక్షేమం కోసం పని చేసే అన్నాడీఎంకే ప్రభుత్వం రావడం ఖాయం’ అని పళనిస్వామి తన సందేశంలో వ్యాఖ్యలు చేశారు. దివంగత ఎంజీఆర్, జయలలిత ఆశీస్సులు తమకు పుష్కలంగా ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు.
210 స్థానాల్లో విజయం:
ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి 210 నియోజకవర్గాల్లో కచ్చితంగా విజయం సాధిస్తుందని, భారీ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆయన ఽఽస్పష్టం చేశారు. మే 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరిగే సమయంలో పార్టీ ఏజెంట్లు, అభ్యర్థులు , కార్యకర్తలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కౌంటింగ్ హాల్ లోపల అధికారులు ఇచ్చే ప్రతి రౌండ్ ఫలితాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు.


