సాక్షి, చైన్నె : తమిళనాడు 2026 అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత వెలువడిన ఎగ్జిట్‌పోల్ ఫలితాలు నామ్ తమిళర్ కట్చికి, ముఖ్యంగా సీమాన్‌కు గట్టి షాక్ ఇచ్చాయి. ఈ సర్వేల ప్రకారం సీమాన్ పార్టీ ఈసారి కూడా ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోవచ్చు లేదా అతి తక్కువ స్థానాలకే పరిమితం కావచ్చు. ఏ సర్వే కూడా ఈ పార్టీకి నిర్ణయాత్మక శక్తి అన్న ఫలితాన్ని ఇవ్వలేదు.
విజయ్ ఎఫెక్ట్‌తో నష్టం
మార్పు కోరుకునే యువత ఓట్లు గతంలో నామ్ తమిళర్ కట్చికి పడేవి. అయితే ఇప్పుడు విజయ్ రాజకీయాల్లోకి రావడంతో, సీమాన్ మద్దతుదారులుగా ఉన్న యువతలో చాలామంది విజయ్ వైపు మొగ్గు చూపారు. సీమాన్ ఓట్లను విజయ్ భారీగా చీల్చడం నామ్ తమిళర్ ఓటమికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
క్షేత్రస్థాయిలో యంత్రాంగం లోపం
డీఎంకే, అన్నాడీఎంకే వంటి పార్టీలకు ఉన్న బలమైన బూత్ కమిటీలు, గ్రామస్థాయి కార్యకర్తల నెట్‌వర్క్ నామ్ తమిళర్ కట్చికి లేదు. ఇది ఎన్నికల రోజున ఓటర్లను పోలింగ్ బూత్ వరకు తీసుకురావడంలో ప్రతిబంధకంగా మారింది. ఒంటరి పోరాటం అనే సీమాన్ విధానం వల్ల తాజాగా కూడా ఒరిగిందేమీ లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. సీమాన్ మాట్లాడే తీవ్రమైన తమిళ జాతీయవాదం కంటే, విజయ్ చూపిస్తున్న మార్పు అనే నినాదం కొత్త ఓటర్లను, సీమాన్ వెన్నంటి ఉన్న యువతను ఎక్కువగా ఆకర్షించినట్లు సర్వేలు సూచిస్తున్నాయి. సీమాన్ నామ్ తమిళర్ కట్చితో రెండు దశాబ్దాలు ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొని 8 శాతం ఓట్లను సాధించారు. అయితే, ఆ ఓటు బ్యాంక్‌కు ఈ సారి పెద్ద గండం తప్పదని రాజకీయ వర్గాలుపేర్కొంటున్నాయి. అదే సమయంలో కారైక్కుడి నుంచి పోటీ చేసిన సీమాన్ తప్పని సరిగా నెగ్గాలని, ఇతరుల వరుసలో ఉన్న ఆరేడు సీట్లలో ఆ పార్టీకి చెందిన పట్టభద్రులు గెలవాలని ఆకాంక్షించే వారు తాజాగా ఉండటం విశేషం.


