సాక్షి, చైన్నె: శస్త్ర చికిత్సతో పని లేకుండా గుండెకు ఏక కాలంలో రెండు సంక్లిష్ట చికిత్సలను చైన్నె అడ యార్‌లోని ఎంజీఎం హెల్త్‌కేర్ మలర్ ఆసుపత్రి వైద్యులు విజయవంతం చేశారు. ఒకే రోగికి ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా, కేవలం క్యాథెటర్ విధానం ద్వారా టావీ, డ్యూయల్ ఛాంబర్ లీడ్‌లెస్ పేస్‌మేకర్ అమర్చి ప్రాణాపాయం నుంచి కాపాడారు సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ మదన్ మోహన్ బృందం బుధవారం ఈ చికిత్స వివరాలను స్థానికంగా ప్రకటించారు.75 ఏళ్ల వృద్ధురాలికి గతంలో బైపాస్ సర్జరీ జరిగిందని, అయితే, తీవ్రమైన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది , మూడు నెలల్లో మూడుసార్లు స్పృహ తప్పి పడిపోవడంతో ఆసుపత్రిలో చేరారని వివరించారు. పరిశోధనలో ఆమెకు గుండె ప్రధాన కవా టం కుంచించుకుపోవడం, గుండెలో ప్రసరణలో లోపం ఉన్నట్లు నిర్ధారణ చేశామన్నారు. వయస్సు గతంలో జరిగిన సర్జరీ దృష్ట్యా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడం ప్రమాదకరమని భావించి అత్యాధునిక కనిష్ట ఇన్వాసివ్ పద్ధతిని ఎంచుకున్నట్టు తెలిపారు. కాలి రక్తనాళం ద్వారా క్యాథెటర్‌ను పంపి, పాడైపోయిన గుండె కవాటం స్థానంలో కొత్త కవాటాన్ని అమర్చామని, గుండె లయను సరిచేయడానికి ఎటువంటి వైర్లు లేదా సర్జరీ లేకుండా నేరుగా గుండె గదుల్లో రెండు చిన్న పరికరాలను అమర్చామన్నారు. ఇవి వైర్‌లెస్ సాంకేతికతతో పనిచేస్తాయని వివరించారు.శస్త్రచికిత్స లేకుండా కేవలం రక్తనాళాల ద్వారా జరిగిన ఈ ప్రక్రియ వల్ల రోగి వేగంగా కోలుకున్నారని ప్రకటించారు. ఆసుపత్రి సీఓఓ వేణుగోపాల్ భట్ మాట్లాడుతూ, భవిష్యత్తులో గుండె చికిత్సలు సర్జరీ లేకుండా ఇంతే కచ్చితత్వంతో జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.


