తమిళసినిమా: నటుడు, చాయాగ్రాహకుడు నట్టి నటరాజన్ కథానాయకుడిగా నిలబెట్టిన చిత్రం చతురంగవేట్టై. ఈ చిత్రానికి హెచ్.వినోద్ దర్శకుడు. ఈయనకు ఇదే తొలి చిత్రం అన్నది గమనార్హం. ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. అంతే కాకుండా హెచ్.వినోద్‌ను ప్రముఖ దర్శకుడిగా, నటుడు నట్టి నటరాజన్‌ను బిజీ హీరోగా మార్చిన చిత్రం అది. ఇటీవల విజయ్ హీరోగా జననాయగన్ చిత్రానికి దర్శకత్వం వహించిన హెచ్.వినోద్ ప్రస్తుతం కార్తీ కథానాయకుడిగా చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఇకపోతే నట్టి నటరాజన్ తాజాగా టీఎన్ 26 అనే సమకాలీన రాజకీయాలకు అద్దం పట్టే చిత్రంలో నటించి వార్తల్లో నిలిచారు. కాగా తాజాగా ఈయన నూతన చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి దర్శకుడు హెచ్.వినోద్ కథను అందిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి ఆయన శిష్యుడొకరు దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. కాగా హెచ్ వినోద్, నట్టి నటరాజన్ హిట్ కాంబో ఇప్పుడు రిపీట్ కానుండడంతో చిత్రంపై మంచి అంచనాలు నెలకొనడం సహజమే.


