తమిళసినిమా: యాక్షన్ కింగ్‌గా అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నటుడు అర్జున్. పలు భాషల్లో హీరోగా నటించిన ఈయనలో మంచి దర్శకుడు, నిర్మాత ఉన్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. కాగా ఇటీవల క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు చిత్రాల్లో నటిస్తున్న అర్జున్ తాజాగా మరోసారి యాక్షన్ హీరోగా తెరపైకి రానున్నారు. ఇంతకు ముందు గోట్, లవ్ టుడే, డ్రాగన్ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ అధినేతలు కల్పాత్తి ఎస్.అఘోరం, కల్పాత్తి ఎస్.గణేశత, కల్పాత్తి ఎస్.సురేష్ తాజాగా నటుడు అర్జున్ హీరోగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో నటి అభిరామి, ప్రీతి ముకుందన్ ప్రధాన పాత్రలు పోషించారు. నటుడు జాన్ కొక్కెన్, వివేక్ ప్రసన్న, అర్జున్ చిదంబరం తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం ద్వారా సుభాష్ కే.రాజ్ దర్శకత్వం దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ శిష్యుడు కావడం గమనార్హం. కాగా ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తున్న 28వ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రానికి బ్లాస్ట్ అనే టైటిల్ ను నిర్వహించారు.దీనికి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలో తెరపైకి తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. కాగా దీనికి అరుణ్ రాధాకృష్ణన్ ఛాయాగ్రహణం, కేజీ ఎఫ్ చిత్రం ఫేమ్ రవి బస్రూర్ సంగీతాన్ని అందించారు.


