వేలూరు: తమిళ పంగుణి మాస ఉత్సవాల్లో భాగంగా సోమవారం స్వామి వారికి తీర్థవారి నిర్వహించారు. అరుణాచలేశ్వరాలయంలో డిసెంబర్ మాసంలో మహా దీపోత్సవం పది రోజుల పాటూ జరుగుతుంది. అదేవిధంగా పంగుణి ఉత్సవాలను కూడా మార్చి మాసంలో నిర్వహించడం ఆనవాయితీ. అందులో బాగంగా పంగుణి మాత కళ్యాణోత్సవం పంచమూర్తుల సాక్షిగా ఈనెల 2వ తేదిన జరిగింది. అదే రోజు సాయంత్రం అన్నామలైయార్, ఉన్నామలై అమ్మవారి ఆలయ ద్వజా రోహణం వద్ద భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో బాగంగా ఆరవ రోజైన సోమవారం తామర కోనేటిలో తీర్థవారి కార్యక్రమం జరిగింది. ఆ సమయంలో తిరుకళ్యాణోత్సవం సమయంలో ఉంచిన నవధాన్యాలు కోనేటిలో వదిలారు. ముందుగా అన్నామలైయార్, ఉన్నామలై అమ్మవారు, పరాశక్తి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, పుష్పాలంకరణలు చేసి తామర కోనేటి వద్దకు తీసుకొచ్చారు. అనంతరం కోనేటి వద్ద అన్నామలైయార్‌కు హరోం హరా అంటూ నామస్మరణాలు చేసుకొని పూజలు చేసి తీర్థవారి నిర్వహించారు. అనంతరం అన్నామలైయార్, ఉన్నామలై అమ్మవారు, పరాశక్తి అమ్మవారిని రాత్రి భక్తుల దర్శనార్థం మాడ వీధుల్లో ఊరేగించారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారికి కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు.


