రిజర్వుడ్‌ స్థానాల్లో అభ్యర్థులపై పిటిషన్‌ | - | Sakshi
Sakshi News home page

రిజర్వుడ్‌ స్థానాల్లో అభ్యర్థులపై పిటిషన్‌

Apr 7 2026 7:43 AM | Updated on Apr 7 2026 7:43 AM

● తక్షణం విచారణకు హైకోర్టు నిర్ణయం

సాక్షి, చైన్నె: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రిజర్వుడు స్థానాల విషయంలో సోమవారం దాఖలైన ఓ కీలక పిటిషన్‌ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. షెడ్యూల్డ్‌ కులాలకు కేటాయించిన నియోజకవర్గాల్లో కేవలం హిందూ, సిక్కు , బౌద్ధ మతాలను అనుసరించే వారిని మాత్రమే పోటీకి అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను చైన్నె హైకోర్టు మంగళవారం అత్యవసరంగా విచారించనుంది. హిందూ మక్కల్‌ కట్చి వ్యవస్థాపక అధ్యక్షుడు అర్జున్‌ సంపత్‌ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.

పిటిషనర్‌ వాదన

అర్జున్‌ సంపత్‌ తరపు న్యాయవాది ఎస్‌. కార్తికేయబాలన్‌ కోర్టులో తన వాదనలను వినిపిస్తూ పలు కీలక అంశాలను లేవనెత్తారు. రాజ్యాంగం ప్రకారం.. హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాలను అనుసరించేవారిని మాత్రమే షెడ్యూల్డ్‌ కులాలుగా పరిగణించాలని ఇటీవలే సుప్రీంకోర్టు కూడా ఈ స్పష్టం చేసినట్టు వివరించారు. తమిళనాడులోని మొత్తం 44 రిజర్వుడు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో సుమారు 90 శాతం మంది హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకు చెందని వారు (ప్రధానంగా క్రైస్తవ మతానికి మారిన వారు) ఉన్నారని పిటిషనర్‌ ఆరోపించారు. నామినేషన్ల పరిశీలన సమయంలో అభ్యర్థుల మతపరమైన స్థితిగతులను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, ఈ మేరకు ఎన్నికల అధికారులందరికీ ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన కోరారు. అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల గడువు సోమవారంతో ముగిసింది మంగళవారం (ఏప్రిల్‌ 7) నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఒకవేళ ఈ లోపు స్పష్టత రాకపోతే అనర్హులు పోటీ చేసే అవకాశం ఉందని పిటిషనర్‌ తరపు న్యాయవాది అత్యవసర విచారణ కోరారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.ఎ. ధర్మాధికారి, న్యాయమూర్తి అరుల్‌ మురుగన్‌తో కూడిన ధర్మాసనం, మంగళవారం కేసును విచారిస్తామని ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement