కలల ప్రపంచంలో రాహుల్‌ గాంధీ విహారం | - | Sakshi
Sakshi News home page

కలల ప్రపంచంలో రాహుల్‌ గాంధీ విహారం

Apr 7 2026 7:43 AM | Updated on Apr 7 2026 7:43 AM

●అమిత్‌ షా ఎద్దేవా

సాక్షి, చైన్నె : పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ఇండియా కూటమిపై సోమవారం తీవ్ర ఆరోపణలు, విమర్శలు ఎక్కుపెట్టారు. సోమవారం సాయంత్రం తిరుకనూరులో జరిగిన ఎన్డీయే బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వాస్తవ ప్రపంచంలో కాకుండా కలల లోకంలో విహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆయన ఇక్కడకు వచ్చి పాకిస్థాన్‌న్‌లో ధరల పెరుగుదల గురించి మాట్లాడుతూ ఇక్కడి ప్రజలను భయపెడుతున్నారన్నారు. పుదుచ్చేరిలో ఇండియా కూటమి నాయకులు అధికారంలోకి రాకముందే పదవుల కోసం ఇప్పుడే కొట్టుకుంటున్నారని విమర్శించారు.

నారాయణస్వామి పాలనపై ధ్వజం

గతంలో జరిగిన కాంగ్రెస్‌ పాలన పుదుచ్చేరిని వెనక్కి నెట్టిందని అమిత్‌ షా ఆరోపించారు. అభివృద్ధి కుంటుపడిందన్నారు.మాజీ సీఎం నారాయణస్వామి హయాంలో పుదుచ్చేరి అభివృద్ధిలో వెనుకబడింది. ఆ నష్టాన్ని పూడ్చడానికే తమకు ఐదేళ్లు పట్టింది. ఇప్పుడు పుదుచ్చేరి అభివృద్ధి పథంలో దూసుకుపోవాలంటే మళ్లీ ఎన్డీయే కూటమినే గెలిపించాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్‌ నేత ఖర్గేకు కౌంటర్‌

గత ఎన్నికల్లో పుదుచ్చేరిలో ఎన్డీయే విజయం సాధించినప్పుడు, అది ఒక చిన్న ప్రాంతమని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎగతాళి చేశారని అమిత్‌ షా గుర్తు చేశారు. అది 300 సీట్లు అయినా, 30 సీట్లు అయినా.. పుదుచ్చేరి భారతదేశంలో అంతర్భాగం. పుదుచ్చేరి తమ గుండెల్లో ఉందన్నారు. భారత్‌ విజయానికి పుదుచ్చేరి విజయం చాలా అవసరం అని స్పష్టం చేశారు.

ఉద్యోగ మేళాలపై ప్రశంసలు

మన్నడిపట్టు అభ్యర్థి, మంత్రి నమశ్శివాయం చేపట్టిన అభివృద్ధి పనులను అమిత్‌ షా ప్రశంసించారు. ఎన్నికల సమయంలో భారీ స్థాయిలో ఉద్యోగ మేళాలు నిర్వహించి యువతకు ఉపాధి కల్పించవచ్చనే నమ్మకాన్ని నమశ్శివాయం వాస్తవం చేసి చూపించారని కొనియాడారు. పుదుచ్చేరిలో ఎన్డీయే కూటమిని తిరిగి అధికారంలోకి తీసుకురావడం ద్వారా డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అమిత్‌ షా ఓటర్లకు హామీ ఇచ్చారు. సభలో ఎన్డీయే అభ్యర్థులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement