మైలాపూర్‌లో మైలేజ్‌ ఎవరికో..? | - | Sakshi
Sakshi News home page

మైలాపూర్‌లో మైలేజ్‌ ఎవరికో..?

Apr 7 2026 7:43 AM | Updated on Apr 7 2026 7:43 AM

ఓటర్లను ఆకర్షించేందుకు వ్యూహాలు మళ్లీ తనదే గెలుపు అంటున్న సిట్టింగ్‌ ఎమ్మెల్యే వేలు సత్తాచాటేందుకు టీవీకే, ఎన్‌టీకే యత్నాలు

సాక్షి,చైన్నె : తమిళనాడు రాజధాని నగరం చైన్నెలో అత్యంత పురాతన ప్రాంతాలలో మైలాపూర్‌ ఒకటి. ప్రసిద్ధ కపాలీశ్వరర్‌ ఆలయం, శాంతోమ్‌ చర్చి ఈ నియోజకవర్గంలోనే ఉన్నాయి. ఇక్కడ ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలలో అన్నాడీఎంకే ఏడు సార్లు విజయ కేతనం ఎగుర వేసింది. గతంలో రెండు సార్లు గెలిచినా, చివరకు రెండు దశాబ్దాల తర్వాత 2021లో డీఎంకే అభ్యర్థి టి. వేలు పాగా వేశారు. ఇక, ఇక్కడ ఒకప్పుడు కాంగ్రెస్‌ మూడు సార్లు గెలిచినా, ఐదు దశాబ్దాలుగా ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి పోటీకి సాహసించ లేదు. ఇక, 2001లో ఇక్కడ బీజేపీ విజయ ఢంకా మోగించింది. అప్పటి సీనియర్‌ నేత కేఎన్‌ లక్ష్మణన్‌ గెలిచారు.

గెలుపు గుర్రం ఎవరో..

ఇక్కడ మొత్తం 1,94,731 ఓటర్లు ఉన్నారు. మహిళా ఓటర్లే ఎక్కువ. పురుషులు93,017, మహిళలు1,01,691, ఇతరులు 23 మంది ఉన్నారు. మైలాపూర్‌లో మత్స్యకార సామాజిక వర్గం, బ్రాహ్మణ సామాజిక వర్గం ఓట్లు అత్యంత కీలకం. ఈ ఓటుతో డీఎంకే తన పట్టును నిలుపుకుంటుందా? లేదా తమిళిసై ద్వారా ఇక్కడ కమలం వికసిస్తుందా..? లేదా విజయ్‌ రూపంలో విజిల్‌ మోత మోగేనా అన్నది వేచి చూడాల్సిందే.

నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు

ఈ పరిధిలోని మందవేలి, అభిరామపురం వంటి ప్రాంతాల్లో డ్రైనేజీ సమస్యలు, పాత నివాస ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కొరత ప్రధానంగా మారింది. మెట్రో రైలు పనుల కారణంగా నిత్యం ట్రాఫిక్‌ జాం ఏర్పడటం సామాన్యులకు పెద్ద ఇబ్బందిగా మారింది. వేసవిలో తాగునీటి ఎద్దడి, వర్షాకాలంలో వర్షపు నీరు నిలిచిపోవడం వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం ఓటర్లు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఒక్కచాన్స్‌ ప్లీజ్‌ అంటున్న తమిళిసై

ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఒక్క సారైనా విజయకేతనం ఎగుర వేయాలన్న ఆకాంక్షతో గవర్నర్‌ పదవిని సైతం త్యాగం చేసి వరుస ఎన్నికలను బీజేపీ మహిళా సీనియర్‌ నేత తమిళి సై సౌందరరాజన్‌ ఎదుర్కొంటూ వస్తున్నారు. తాజాగా ఆమె ఒక్క ఛాన్స్‌ ప్లీజ్‌ అంటూ మైలాపూర్‌ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. అయితే సిట్టింగ్‌ సీటులతో తనదే మళ్లీ విజయం అన్న ధీమాతో డీఎంకే అభ్యర్థి టీ వేలు ఉన్నారు. ఇక ఈ ఇద్దరీ మధ్యలో ఓట్లను చీల్చే దిశగా తమిళగ వెట్రి కళగం (టీవీకే), నామ్‌ తమిళర్‌ కట్చి (ఎన్‌టీకే) అభ్యర్థులు ఉన్నారు.

తమిళిసై విశ్వ ప్రయత్నం

తమిళిసై సౌందరరాజన్‌ ఆమె తమిళనాడుకే కాదు, తెలంగాణ, పుదుచ్చేరికి సైతం సుపరిచితురాలే. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి బీజేపీలో పనిచేస్తున్నారు. తమిళనాడు పార్టీ అధ్యక్షురాలుగా సైతం సేవలు అందించారు. అయితే, ఆమె ఆకాంక్ష అంతా ఒక్క సారైనా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవాలన్నదే. 2006, 2011 అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009, 2019 లోక్‌సభ ఎన్నికలలో సైతం పోటీ చేసినా అదృష్టం దక్కలేదు. చివరకు ఆమెకు తెలంగాణ గవర్నర్‌గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఏక కాలం పనిచేసే అవకాశం దక్కింది. అయినా, ఎన్నికలలో పోటీ చేసి గె లవాలన్న ఆకాంక్ష ఆమెలో తగ్గలేదు. గవర్నర్‌ పదవికి రాజీనామా చేసి మరీ 2024 లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసినా అదృష్టం దక్కలేదు. ఈ పరిస్థితులలో తాజాగా అసెంబ్లీ ఎన్నికలలో మైలాపూర్‌ నుంచి ఎన్నికల రేసులోకి దిగారు. ఈసారి తనకు ఓటర్లు ఒక్క ఛాన్స్‌ ఇస్తారన్న నమ్మకంతో ఉన్నారు. ఇందుకు అన్నాడీఎంకే, పీఎంకే , టీఎంసీ తదితర పార్టీలతో కూడిన తమ కూటమి బలంతో పాటూ బ్రహ్మణ సామాజిక వర్గం ఓట్లు కూడా కలిసి వస్తుందన్న ధీమా కారణంగా చెప్పవచ్చు. ఇక ఆమె డీఎంకే సిట్టింగ్‌ ఎమ్మెల్యే టీ వేలును ఢీ కొడుతున్నారు. స్థానికుడైన వేలు నిత్యం ప్రజల్లోనే ఉండే వ్యక్తి కావడంతో గెలుపు కోసం ఆమె మరింత శ్రమించక తప్పదు. గత ఐదు సంవత్సరాలలో తాను చేసిన అభివృద్ధి గెలిపిస్తుందన్న ధీమా వేలులో ఉన్నప్పటికీ, టీవీకే తరపున ఆ పార్టీ కోశాధికారి వెంకటరమణన్‌ ఇక్కడ రేసులో ఉండడంతో ఓట్ల చీలిక టెన్షన్‌ రేపుతోంది. విజయ్‌ అభిమానులు, యువతను ఆకట్టుకునే ప్రయత్నంలో వెంకటరమణన్‌ ఉన్నారు. నామ్‌ తమిళర్‌కట్చి(ఎన్‌టీకే) అభ్యర్థిగా అరుణ్‌ పోటీ చేస్తున్నారు. తమిళ జాతీయవాదం , స్వచ్ఛమైన రాజకీయాల నినాదంతో ప్రచారంలో ఉరకలు తీస్తున్నారు. వీరితో పాటూ తమిళగ ద్రావిడర్‌ కట్చి నుండి మూర్తి, స్వతంత్ర అభ్యర్థిగా స్థానికుడైన విజయ కృష్ణ కూడా ఇక్కడ రేసులో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement