తండ్రి కోసం తనయుడి త్యాగం! | - | Sakshi
Sakshi News home page

తండ్రి కోసం తనయుడి త్యాగం!

Apr 7 2026 7:43 AM | Updated on Apr 7 2026 7:43 AM

● ఎన్నికల నుంచి తప్పుకున్న వినోద్‌ గాంధీ ● చివరి నిమిషంలో నిర్ణయం

సాక్షి, చైన్నె : సాధారణంగా పిల్లల కోసం తండ్రులు త్యాగాలు చేస్తారు. అయితే ఇక్కడ తండ్రి కోసం తనయుడు ఏకంగా తనకు దక్కిన సీటును చివరిక్షణంలో త్యాగం చేశాడు. ఇది డీఎంకేలో పెద్ద చర్చకే దారి తీసింది. చివరి క్షణంలో తనయుడు తీసుకున్న నిర్ణయంతో చివరకు తండ్రినే అభ్యర్థిగా డీఎంకే ప్రకటించాల్సి వచ్చింది. వివరాలు.. ఈసారి డీఎంకే ముగ్గురు మంత్రులకు సీటు ఇవ్వకుండా పక్కన పెట్టింది. ఇందులో ఆర్‌. గాంధి, మనో తంగరాజ్‌, కయల్వెలి సెల్వరాజ్‌ ఉన్నారు. అయితే ఆర్‌. గాంధీకి బదులుగా ఆయన తనయుడు వినోద్‌ గాంధీని అభ్యర్థిగా ఎంపిక చేశారు. తనకు సీటు ఇవ్వకుండా తనయుడికి ఇవ్వడంతో గాంధీ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. అంతే కాకుండా తనయుడి నియోజకవర్గంలో కాకుండా, ఇతర నియోజకవర్గాలలో డీఎంకే అభ్యర్థుల కోసం గాంధీ రాజకీయ పావులు కదుపుతూ రావడంతో వినోద్‌ గాంధీ తన తండ్రిలోని అసంతృప్తి, ఆవేదనను గుర్తించినట్టున్నారు.

పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు లేఖ

తనకు దక్కిన ఎమ్మెల్యే సీటును తండ్రి కోసం త్యాగం చేస్తూ వినోద్‌ గాంధీ సోమవారం నిర్ణయం తీసుకున్నారు. సోషల్‌ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించారు. పార్టీ అధినేతకు దీనిని ఓ లేఖగా పంపించారు. రాణిపేట అభ్యర్థిగా తనకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి స్టాలిన్‌కు, సోదరుడు ఉదయనిధి స్టాలిన్‌కు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. అయితే, తన తండ్రికి మళ్లీ పోటీ చేయాలనే బలమైన కోరిక ఉందని, ఆయన ఇష్టాన్ని గౌరవిస్తూ, ఈ అవకాశాన్ని తిరిగి ఆయనకే అప్పగించాలని నిర్ణయించుకున్నానని పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రజలకు సేవ చేసే అవకాశం మళ్లీ వస్తుందని నమ్ముతున్నానని పేర్కొన్నారు. దీంతో డీఎంకే అధిష్టానానికి షాక్‌ తప్పలేదు. అదే సమయంలో మంత్రి గాంధీకి సీటు నిరాకరించడంపై ఆయన వర్గీయుల్లో తీవ్ర అసహనంతో ఉండటమే కాకుండా, వినోద్‌ గాంధీకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నట్టు సమాచారాలు వెలుగులోకి వచ్చాయి. వినోద్‌ గాంధీకి పార్టీ వర్గాలు సహకరంచడం లేదన్న సమాచారంతో చివరకు గాంధీకి బీ ఫాం అప్పగిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దీంతో తన కుమారుడు వినోద్‌, ఇతర కూటమి పార్టీ స్థానిక నేతలతో కలిసి గాంధీ ఆగమేఘాలపై నామినేషన్‌ దాఖలు చేయడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement