న్యూస్‌రీల్
– స్థానిక కాంగ్రెస్‌లో వ్యతిరేకత
సాక్షి, చైన్నె : మదురై జిల్లా మేలూరు నియోజకవర్గంలో కాంచీపురం మాజీ ఎంపీ విశ్వనాథన్‌కు పెద్ద షాక్ తగిలింది. ఆయన్ను అభ్యర్థిగా అంగీకరించే ప్రసక్తే లేదని అక్కడి కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. డీఎంకే కూటమిలో మేలూరును కాంగ్రెస్‌కు పార్టీకి కేటాయించారు. ఈ సీటుకు చివరి క్షణంలో ఆదివారం అభ్యర్థిని ప్రకటించారు. స్థానికంగా ఉన్న పలువురు కీలక నేతలు సీటు కోసం ప్రయత్నించినా, చివరకు జనరల్ స్థానంలో వెనుకబడిన సామాజిక వర్గం నేత, కాంచీపురానికి చెందిన మాజీ ఎంపీ విశ్వనాథన్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించడంతో కాంగ్రెస్ స్థానిక నేతల్లో అసంతృప్తి రేగింది. దీంతో విశ్వనాథన్ ఒంటరిగా మిగలాల్సిన పరిస్థితి కలిగింది. సోమవారం మేలూరు నియోజకవర్గ కాంగ్రెస్ కార్యాలయానికి వచ్చిన ఆయన్ను బయటకు వెళ్లి పోవాలంటూ స్థానిక నేతలు హెచ్చరించారు. వారిని బుజ్జగించేందుకు విశ్వనాథన్ ప్రయత్నించినా స్థానిక నేతలు ఏమాత్రం తగ్గలేదు. ఆయన్ను నిలబెట్టి మరీ స్థానిక నేతలు కుర్చీల్లో కూర్చుని నిలదీయడంతోపాటు తీవ్రంగా హెచ్చరించారు. దీంతో అక్కడి నుంచి ఆయన మరేమీ మాట్లాడకుండా వెళ్లిపోయారు. పార్టీ తనకు బీ–ఫాం ఇచ్చిన నేపథ్యంలో ఆయన తనతో పాటు కాంచీపురం నుంచి వచ్చిన మద్దతుదారులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. మేలూరులో పరిస్థితిని చక్కదిద్దేందుకు టీఎన్‌సీసీ పెద్దలు రంగంలోకి దిగారు.
అస్సాం, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం..
– స్వస్థలాలకు ఉత్తరాది కార్మికుల ప్రయాణం
కొరుక్కుపేట: తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. పుదుచ్చేరి, అస్సాం రాష్ట్రాలలో శాసనసభ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ 9వ తేదీన జరగనుంది. ఈ నేపథ్యంలో, తిరుప్పూర్‌లో పనిచేస్తున్న ఆయా రాష్ట్రాలకు చెందిన వేలాది మంది కార్మికులు ఓటు వేయడానికి తమ స్వస్థలాలకు బయలుదేరడానికి సిద్ధమవుతున్నారు. వివరాలు.. తిరుప్పూర్‌లోని నిట్‌వేర్ పరిశ్రమ , ఇతర ఉత్పాదక రంగాలలో వివిధ రాష్ట్రాల నుండి లక్షలాది మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ఇందులో, ఉత్తర ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ , అస్సాం తర్వాతి అతిపెద్ద ఉపాధి కల్పించే రాష్ట్రాలుగా ఉన్నాయి. ప్రస్తుతం వారి సొంత రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నందున, ఇక్కడి కార్మికులు ఎలాంటి ఆటంకం లేకుండా వెళ్లి ఓటు వేయడానికి వీలుగా కంపెనీలు వారికి సెలవులు మంజూరు చేయాలని వస్త్ర పరిశ్రమతో సహా పారిశ్రామికవేత్తలందరికీ కార్మికశాఖ గత వారం ఓ సర్క్యులర్ జారీ చేసింది. దీని కారణంగా సెలవు ప్రకటించడంతో అస్సాం కార్యకర్తలు ఎన్నికలలో తమ ప్రజాస్వామ్య కర్తవ్యాన్ని నెరవేర్చడానికి ఉత్సాహంగా తమ సొంత ఊళ్లకు తరలివస్తున్నారు. దీంతో తిరుప్పూర్ రైల్వే స్టేషన్ వద్ద భారీగా రద్దీ ఏర్పడింది.


