తమిళసినిమా: దర్శకుడు బాలా దర్శకత్వంలో వహించిన అవన్ ఇవన్ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమైన నటి జనని. తొలి చిత్రంలోనే తనదైన నటనతో అందరినీ ఆకట్టుకుని ప్రశంసలు అందుకున్నారీమె. ఆ తరువాత తెగిడి, బెలూన్, హార్ట్ స్పాట్ సక్సెస్‌ఫుల్ చిత్రాల్లో నటించిన జనని పలు మలయాళ చిత్రంలోనూ నటించారు. ఈ బ్యూటీ సోమవారం పెళ్లి పీటలు ఎక్కారు. తన చిరకాల బాయ్‌ఫ్రెండ్ సాయిరోషన్ శ్యామ్‌తో కలసి ఏడడుగులు నడిచారు. చైన్నెలో పుట్టి పెరిగిన సాయిరోషన్ శ్యామ్ దుబాయ్‌లో సెటిల్ అయ్యారు. విమానయానంలో పనిచేస్తున్న ఈయనకు, జననికి గత ఏడాదే వివాహ నిశ్చితార్థం జరిగింది. సోమవారం జరిగిన వీరి వివాహానికి చైన్నె, మహాబలిపురంలోని ఒక నక్షత్ర హోటల్ వేదికగా మారింది. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, బందువుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా జనని, సాయి రోషన్ శ్యామ్‌కు వివాహం జరిగింది. వీరి వివాహ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
సూరితో
జత కడుతుందా?
తమిళసినిమా: సినిమా ఎవరిని ఎప్పుడు, ఏ స్థాయిలో నిలబెడుతుందో తెలియదు. అప్పటివరకు ప్రయత్నం లోపం లేకుండా శ్రమిస్తూనే ఉండాలి. అలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సహాయ నటుడి నుంచి హాస్యనటుడిగా ఎదిగి ఇప్పుడు సక్సెస్‌ఫుల్ హీరోగా రాణిస్తున్న నటుడు సూరి. విడుదలై చిత్రంతో హీరోగా పయనం ప్రారంభించిన ఈయన ఇటీవల విడుదలైన మామన్ వరకు వరుసవిజయాలతో దూసుకుపోతున్నారు. కెరీర్‌ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్న సూరి ప్రస్తుతం మండాడి అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఇది సముద్రతీరంలో జాలర్ల బోట్ల పోటీల నేపథ్యంలో రూపొందుతున్న కథా చిత్రం. ఈ చిత్రానికి మదిమారన్ పుహళేంది కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో రూపొందడం విశేషమే. ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే సూరి కొత్త చిత్రానికి కమిట్ అయ్యారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుండడం విశేషం. రవికుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. 2015లో చైన్నెలో బీభత్సం సృష్టించిన వరద నేపథ్యంలో ఈ చిత్రం కథ ఉంటుందని సమాచారం. ఈ చిత్రం త్వరలో సెట్‌పైకి వెళ్లబోతోంది. ఇందులో సూరికి జంటగా నటించే కథానాయకి ఎవరన్న ప్రశ్నకు మమిత బైజు పేరు వినిపిస్తోంది. ఈ కేరళా కుట్టి డ్యూడ్ చిత్రంతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. విజయ్ హీరోగా నటించిన జననాయకన్‌లో ముఖ్య భూమికను పోషించారు. సూర్యకు జంటగా విశ్వనాత్ అండ్ సన్స్ చిత్రంలోనూ, ధనుష్‌తో కర చిత్రంలోనూ నటించారు. ఈ మూడు చిత్రాలు త్వరలో వరుసగా తెరపైకి రావడానికి సిద్ధమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సూరి సరసన మమిత బైజును నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే ఇందులో నిజం ఎంత అన్నది అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి ఉండాల్సిందే.


