నారాయణవనం: టీటీడీ అనుబంధ పద్మావతీ సమేత కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో పంగుణోత్తర ఉత్సవాల్లో నాలుగో రోజు ఆదివారం సాయంత్రం అమ్మవారు ఊంజల్‌సేవలో భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఉదయం సుప్రభాతసేవతో నిత్యపూజాధి కై ంకర్యాలతో అర్చకులు నైవేద్యం సమర్పించారు. పద్మావతీ అమ్మవారికి సర్కారు అభిషేకం పూర్తి చేసి, ధూప, దీప నైవేద్య నివేదన చేశారు. సాయంత్రం నిత్య పూజా కై ంకర్యాలు పూర్తయిన తర్వాత అమ్మవారిని పట్టుపీతాంబరాలు, స్వర్ణాభరణాలను, సుగంధపుష్ప మాలికలతో సుందరంగా అలంకరించి తిరుచ్చి వాహనంపై అధిష్టింప చేశారు. ఆలయ అంతర ప్రాకారంలో ఊరేగిన అమ్మవారు ఊంజల్ మండపంలో ఊయలపై కొలువుదీరారు. వేద మంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల నడుమ అమ్మవారి ఉయ్యాల సేవ కనుల పండువగా కొనసాగింది. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. టీటీడీ స్థానిక ఆలయాల సూపరింటెండెంట్ ధర్మయ్య, ఆలయ అధికారి నాగరాజు, ఆర్జితం అధికారి భరత్, ప్రధాన అర్చకులు శ్రీధరభట్టాచార్య, శ్రీనివాస రాఘవ భట్టాచార్య, నరసింహరాఘవ భట్టాచార్యులు ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు.


