చారిత్రక విజయం తథ్యమా? | - | Sakshi
Sakshi News home page

చారిత్రక విజయం తథ్యమా?

Mar 27 2026 8:55 AM | Updated on Mar 27 2026 8:55 AM

న్యూస్‌రీల్‌

శరవేగంగా మారుతున్న సమీకరణలు

వ్యూహాలకు పదును

ముక్కోణపు సమరంలో డీఎంకే వైపే సర్వేలు

ప్రజా క్షేత్రంలోకి పళణి స్వామి, విజయ్‌ పరుగులు

2011, 2016లో దివంగత జె. జయలలిత సృష్టించిన వరుస విజయాల ప్రభంజనాన్ని తాజాగా బద్దలు కొట్టే విధంగా చారిత్రక గెలుపు కోసం డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ పావులు కదుపుతున్నారు. సమీకరణలు శరవేగంగామారుతుండటంతో వ్యూహాలకు పదును పెట్టే దిశగా తమిళ పార్టీలు దూకుడుగా ముందుకు సాగుతున్నాయి. స్టాలిన్‌ పాలను చెక్‌ పెట్టడమే లక్ష్యంగా అన్నాడీఎంకే, టీవీకేలు పరుగులు తీస్తున్నాయి. అదే సమయంలో రాష్ట్రంలో పలు కూటములు ఉన్నా, సమరం అన్నది మాత్రం డీఎంకే, అన్నాడీఎంకే ఎన్‌డీఏ కూటమి, టీవీకేల మధ్య మాత్రమేనని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

సాక్షి, చైన్నె : తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఈనెల 30 నుంచి నామినేషన్లు మొదలు కానున్నాయి. దీంతో అభ్యర్థుల కసరత్తులు వేగంగా జరుగుతున్నాయి. ఏప్రిల్‌ 23న పోలింగ్‌, మే 4న కౌంటింగ్‌ జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు తాజాగా ’త్రిముఖ పోరు’ వైపు సాగుతున్నాయి. నటుడు విజయ్‌ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం హడావుడి, అన్నాడీఎంకే, బీజేపి ఎన్డీయే కూటమి ప్రయత్నాలు కనిపిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయి రాజకీయ పరిణామాలు మాత్రం ముఖ్యమంత్రి స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే కూటమికే సానుకూలంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం – సర్వేల అంచనా

2026 కేంద్ర బడ్జెట్‌లో తమిళనాడుకు పెద్దగా కేటాయింపులు జరగక పోవడాన్ని కొందరు విశ్లేషకులు రాజకీయ సంకేతంగా చూస్తున్నారు. అంటే రాష్ట్రంలో మళ్లీ డీఎంకే అధికారంలోకి వస్తుందని కేంద్రం ముందే ఊహించి ఉండవచ్చని భావిస్తున్నారు. అనేక స్వతంత్ర సర్వేలు డీఎంకే కూటమికి 41 శాతం కంటే ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉందని చెబుతుండటం గమనార్హం. ఇక, అన్నాడీఎంకే–బీజేపీ కూటమిలో సమస్యలు ఉన్నా, కేంద్రం పెద్దలతో కలిసి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళణి స్వామి వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మరోవైపు విజయ్‌ పార్టీ టీవీకే 13 నుంచి 15 శాతం ఓట్లు రావచ్చని, అయితే అవి సీట్లుగా మారడం కష్టమని అంచనా వేస్తున్నారు. ఈ చీలిక పరోక్షంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి డీఎంకేకు మేలు చేస్తుందని మరికొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం మీద కూటమి బలం, కార్యకర్తల నెట్‌వర్క్‌, విద్యావంతులైన ఓటర్ల మద్దతు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మహిళా మద్దతుతో స్టాలిన్‌ను రెండోసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడం ఖాయం అన్ని సర్వేలతో పాటుగా అనుభవజ్ఞులైన విశ్లేషకుల వాదనగా ఉండటం గమనార్హం. ఇక రాష్ట్రంలో ఒంటరిగా పయనిస్తున్న నామ్‌ తమిళర్‌ కట్చి సీమాన్‌, దివంగత సీఎం జె. జయలలిత నెచ్చెలి శశికళ, పీఎంకే వ్యవస్థాకుడు రాందాసు ఓ కూటమిగా ముందుకు సాగినా, ఇవన్నీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఓ వైపు, అన్నాడీఎంకే ఖాతాలో పడాల్సిన ఓట్లను చీల్చే అవకాశాల కారణంగా డీఎంకేకు అనుకూలంగా పరిస్థితులను కల్పించడం ఖాయం అన్న చర్చ ఊపందుకుంది. అదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్‌డీఏ పెద్దల వ్యూహాలను తమిళనాట ఆచరణలో పెట్టే దిశగా ముందుకెళ్తున్న పళని స్వామి లో గెలుపు ఆత్మ విశ్వాసం ఎక్కువగానే ఉంది. డీఎంకే కుటుంబ పాలన, అవినీతి , అక్రమాలను అస్త్రంగా చేసుని ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. ఈ దృష్ట్యా, ఓటరు తీర్పు ఎలా ఉంటుందో, చరిత్ర సృష్టిస్తారా? రికార్డులు బద్దలు కొడతారా? అన్నది ఫలితాల వరకు ఎదురు చూడాల్సిందే.

చారిత్రక అవకాశం – బలమైన కూటమి

1971 తర్వాత తమిళనాడులో ఏ ద్రావిడ పార్టీ కూడా వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదు. ఈ రికార్డును దివంగత సీఎం జె. జయలలిత 2011, 2016లో తన ఖాతాలో వేసుకున్నారు. తాజాగా డీఎంకే గెలిస్తే ఇది ఓ చరిత్ర అవుతుంది. ప్రస్తుతం డీఎంకే 21 పార్టీలతో కూడిన అత్యంత బలమైన మెగా కూటమిని కలిగి ఉంది. ఇందులో కాంగ్రెస్‌, వీసీకే, సీపీఐ, సీపీఎం, ఎండీఎంకే, డీఎండీకేలతో పాటుగా మైనారిటీ పార్టీలన్నీ కీలకంగా ఉన్నాయి. ఈ కూటమిలోని ప్రతి చిన్న పార్టీకి ఒక ప్రత్యేక ఓటు బ్యాంక్‌ ఉండటం డీఎంకేకు అతిపెద్ద ప్లస్‌ పాయింట్‌గా మారిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

పారిశ్రామిక – కార్పొరేట్‌ వర్గాల మొగ్గు

ప్రస్తుత అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితుల్లో (యుద్ధాలు, ఆర్థిక ఒడిదుడుకులు), పెద్ద పరిశ్రమలు, కార్పొరేట్‌ సంస్థలు రాజకీయ స్థిరత్వాన్ని కోరుకుంటున్నాయి. డీఎంకే ప్రభుత్వ పాలనా అనుభవం, సెమీకండక్టర్‌, ఈవీ రంగాల్లో పెట్టుబడులు తీసుకురావడం వారికి నమ్మకాన్ని కల్పించినట్లయ్యింది. అనుభవం లేని కొత్త పార్టీలు అధికారంలోకి వస్తే పాలన కుంటుపడుతుందని వారు ఆందోళన చెందుతున్నట్టు మరి కొందరు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ద్రావిడ సిద్ధాంతం – మీడియా ఆధిపత్యం

సామాజిక న్యాయం, సమాఖ్య స్ఫూర్తి, తమిళ ఆత్మగౌరవం వంటి ద్రావిడ సిద్ధాంతాలను డీఎంకే బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ముఖ్యంగా టీవీ చర్చల్లో, సోషల్‌ మీడియాలో డీఎంకే ప్రతినిధులు ప్రత్యర్థుల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొడుతున్నారు. విద్యావంతులైన ఓటర్లు కేవలం సెలబ్రిటీల ప్రభావానికి లోనుకాకుండా, ప్రభుత్వ పథకాలు, స్థిరత్వాన్ని చూసి ఓటు వేసే అవకాశం ఉందంటున్నారు.

క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం

డీఎంకే అసలు బలం అంతా గ్రామస్థాయి కార్యకర్తల వ్యవస్థలో ఉంది. ఉదయనిధి స్టాలిన్‌ నేతృత్వంలోని యువజన విభాగం, బూత్‌ లెవల్‌ ఏజెంట్లు, వాట్సాప్‌ గ్రూపుల ద్వారా ప్రచారం చేయడంలో డీఎంకే మిగిలిన పార్టీల కంటే ముందుంది. ఇక, విజయ్‌ టీవీకేకకు అభిమాన గణం ఉన్నప్పటికీ, వారిని క్రమశిక్షణ కలిగిన ఎన్నికల సైనికులుగా మార్చడంలో తాజాగా విఫలమయ్యారన్న చర్చ జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement