వేలూరు: తిరువణ్ణామలై జిల్లా కీల్‌పెన్నాతూరు సమీపంలోని సోమాసిపట్టి గ్రామంలో వెలసిన శ్రీవళ్లిదేవసేన సమేత బాలసుబ్రమణియార్ ఆలయ మహాకుంబాభిషేకం బుధవారం కనులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాచార్యులతో ప్రత్యేక వేద మంత్రాలు, యాగ పూజలు గజపూజ, మహా గణపతి పూజ, గోపూజ, లక్ష్మీపూజ నిర్వహించారు. అనంతరం వివిధ పుణ్య నదుల నుంచి తీసుకొచ్చిన నీటిని కలశాల్లో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కలశాల్లో ఉంచిన పుణ్య నీటిని శివాచార్యుల వేద మంత్రాల నడుమ ఆలయ రాజగోపురంపైకి తీసుకెళ్లి కలశాలపై పోసి కుంబాభిషేకం చేశారు. అనంతరం పుణ్యనీటిని భక్తులపై చల్లారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేశారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పిచ్చాండి, ఎంపీ అన్నాదురై, డీఆర్‌ఓ రామపార్థిబన్, తహసీల్దార్ రాజేంద్రన్, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


