వేలూరు: రాణిపేట సమీపంలో చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు నీటిలో మునిగి మృతి చెందిన సంఘటన పలువురిని కలచివేసింది. రాణిపేట జిల్లా సిప్‌కాట్ సమీపంలోని తిరువిగనగర్‌కు చెందిన సెల్వం కుమారుడు పార్థిబన్(13), శరవణన్ కుమారుడు నితీష్(14), కమల కన్నన్ కుమారుడు కే.నితీష్ (13) ముగ్గురూ స్నేహితులు. పార్థిబన్ సిప్‌కాట్‌లోని ప్రైవేటు పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పది పరీక్షలు జరుగుతుండడంతో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. దీంతో పార్థిబన్‌తోపాటు ముగ్గురు స్నేహితులు కలిసి సమీపంలోని బనియంబట్టు చెరువులో స్నానానికి వెళ్లారు. చెరువులో దిగి స్నానం చేస్తుండగా ముగ్గురికీ ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయారు. మధ్యాహ్నం వరకు పిల్లలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు అన్ని చోట్ల వెతికారు. ఆ సమయంలో మనియంబట్టు చెరువు గట్టుపై విద్యార్థుల దుస్తులు ఉన్నట్లు గుర్తించిన స్థానికులు తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. దీంతో స్థానికులు సిప్‌కాట్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, గ్రామస్తుల సాయంతో చెరువులోని నీటిలో గాలించారు. ముగ్గురు బాలురునీటిలో ఒకే చోట మునిగి ఉండడంతో వారిని బయటకు తీసి వెంటనే ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే ముగ్గురు మృతిచెందినట్లు నిర్ధారించారు. రాణిపేట పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వాలాజ ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ముగ్గురు విద్యార్థులు ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో ఆ గ్రామం శోకసముద్రంలో మునిగిపోయింది. మృత దేహాలు ఉంచిన ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట మృతుల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు పెట్టడంతో పలువురిని కలచివేసింది.


