తమిళసినిమా: వంద పరోటాలను ఆవురావురుమని తిని, లెక్క తప్పైతే మళ్లీ తింటా మొదటి నుంచి లెక్కపెట్టుకోండి అంటూ వెన్నెలా కబడ్డీ కుళు చిత్రంలో కమెడియన్‌గా నటించిన నటుడు సూరి. ఆ చిత్రం తర్వాత పరోటా సూరి ముద్ర వేసుకున్న ఈయన దాదాపు దశాబ్దన్నర కాలం పాటు చిన్న చిన్న పాత్రల్లో నటించి అలుపెరుగని పోరాటం చేసి ప్రముఖ హాస్యనటుడిగా ఎదిగి, ఆ తరువాత కథానాయకుడి అవతారమెత్తి విజయాలను అందుకుంటున్నారు. అలా కొట్టు కాళీ, విడుదలై, గరుడన్, మారన్ వంటి హిట్ చిత్రాల్లో నటించిన సూరి ఇప్పుడు ఒక ప్రముఖ టాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థలో హీరోగా నటించడానికి సిద్ధం అవుతున్నారు. అవును ఈయన హిరోగా నటించనున్న చిత్రాన్ని ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నవీన్ యేర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. వీరు ఇంతకు ముందు తమిళంలో అజిత్ హీరోగా గుడ్ బ్యాడ్ అగ్లీ, ప్రదీప్ రంగనాథన్ హీరోగా డ్యూడ్ వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. కాగా తాజాగా సూరి హీరోగా మూడో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి ఆర్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఇంతకుముందు ఇండ్రు ప్లేట్లు నాళై , అయలాన్ వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించారన్నది గమనార్హం. కాగా సూరి హీరోగా తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్న చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మంగళవారం విడుదల చేశారు. ఆ పోస్టర్ ఇప్పుడు చిత్రంపై ఆసక్తిని పెంచేస్తోంది. వరద నీటి ప్రవాహంలో మూడొంతులు పైగా మునిగి నిలబడి కథానాయకుడి చేతిలో ఆయుధంతో వెనుక భాగాన్ని చూపుతూ, చుట్టూ చెల్లా చెదురైన వస్తువులు, గ్యాస్ సిలిండర్, ప్రమాదాన్ని, ప్రాణాన్ని కాపాడుకోవడానికి చేసే పోరాటం వంటి ఆ దృశ్యాలతో మర్మంగా ఉన్న ఆ పోస్టర్ అందరిని ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా ఈ పోస్టర్ కింద బ్లడ్ ఫాలోవ్డ్ ది ఫ్లడ్ అనే ట్యాగ్ లైన్ పొందుపరిచారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని యూనిట్ సభ్యులు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.


