అన్నానగర్: ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా వంటగ్యాస్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అందువల్ల, ముందుగా రిజర్వేషన్లు చేసుకున్న తర్వాత, కొన్ని రోజుల తర్వాతే సిలిండర్లను ఇళ్లకు పంపిణీ చేస్తున్నారు. వివరాలు.. విరుదునగర్ జిల్లాలోని కరియపట్టి ప్రాంతంలో, తిరుచుళి రోడ్డులోని సిలిండర్ గిడ్డంగి నుంచి కొన్ని రోజులుగా సిలిండర్ల పంపిణీ సరిగ్గా జరగడం లేదని ప్రజలు ఆరోపించారు. చాలా రోజుల క్రితమే రిజర్వేషన్లు చేసుకున్నప్పటికీ సిలిండర్ల కొరతతో బాధపడుతున్నామని పేర్కొంటూ, మంగళవారం సాయంత్రం పెద్ద సంఖ్యలో ప్రజలు గిడ్డంగిని ముట్టడించారు. అనంతరం వారు తిరుచుళి రోడ్డుపై కూర్చుని ధర్నా చేయడంతో కలకలం నెలకొంది. గంటకు పైగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. పోలీసులు వారితో చర్చించి నిరసన విరమింపజేశారు.


