సరైన ఆధారాలుంటే.. రూ. లక్ష వరకు తీసుకెళ్లవచ్చు! | - | Sakshi
Sakshi News home page

సరైన ఆధారాలుంటే.. రూ. లక్ష వరకు తీసుకెళ్లవచ్చు!

Mar 26 2026 7:45 AM | Updated on Mar 26 2026 7:45 AM

● ఎన్నికల అధికారి అర్చనా పట్నాయక్‌ ● ఎన్నికల మార్గదర్శి విడుదల

సాక్షి, చైన్నె: సరైన ధ్రువీకరణ పత్రాలు ఉంటే రూ. లక్ష వరకు నగదు తీసుకెళ్లవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్‌ తెలిపారు. చైన్నెలో తమిళనాడు శాసనసభ ఎన్నికల మార్గదర్శి 2026ను విడుదల చేసిన అనంతరం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అర్చన పట్నాయక్‌ మీడియాతో మాట్లాడారు. నగదు తరలింపు, ఎన్నికల నిబంధనలపై ప్రజలకు ఉన్న సందేహాలను ఆమె నివృతి చేశారు.

వైద్య కారణాలకు మినహాయింపు

సాధారణంగా ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నప్పుడు రూ. 50 వేలకు మించి నగదు తీసుకెళ్తే ఆధారాలు చూపడం తప్పనిసరి అని గుర్తు చేశారు. అయితే, అత్యవసర వైద్య కారణాల కోసం వెళ్లే వారికి కొంత ఉపశమనం కల్పించామన్నారు. వైద్య అవసరాల కోసం సరైన వైద్య పత్రాలు, ఆసుపత్రి బిల్లులు లేదా చికిత్సకు సంబంధించిన రుజువులను చూపిస్తే రూ. లక్ష కంటే ఎక్కువ నగదును కూడా వెంట ఉంచుకోవచ్చని ఆమె తెలిపారు. వ్యాపారులు – సామాన్యులకు రూ. 50 వేల లోపు నగదుకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. అంతకు మించి ఉంటే మాత్రం ఆ సొమ్ము ఎక్కడిది? దేనికోసం తీసుకెళ్తున్నారు? అనే దానికి సంబంధించిన రశీదులు లేదా పత్రాలు చూపాల్సిన అవశ్యం ఉందన్నారు. తనిఖీల పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలకు ఆదేశాలు జారీ చేసినట్లు అర్చన పట్నాయక్‌ పేర్కొన్నారు. ప్రతి బృందాన్ని జిల్లా స్థాయి నుండి ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారన్నారు. ప్రజలు తమ నిత్యవసరాల కోసం తీసుకెళ్లే సాధారణ మొత్తాలను జప్తు చేయవద్దని సూచించామన్నారు.

సోషల్‌ మీడియాపై సైబర్‌ నిఘా

ఎన్నికల సమయంలో విద్వేషపూరిత ప్రసంగాలు, తప్పుడు ప్రచారాలను అరికట్టేందుకు సైబర్‌ పోలీస్‌ విభాగం ద్వారా ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు. వాట్సా ప్‌, ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో జరిగే ప్రచారాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. డిజిటల్‌ మాధ్యమాల ద్వారా జరిగే భారీ నగదు బదిలీలపై కూడా నిఘా ఉంచామన్నారు. ఒకే పేరున్న అభ్యర్థుల గందరగోళానికి చెక్‌ పెట్టేందుకు చర్యలు చేపట్టారు. ఓటర్లను తప్పుదోవ పట్టించడానికి ఒకే అభ్యర్థి పేరుతో పలువురు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంటుందని, దీనిని నివారించడానికి ఎన్నికల సంఘం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్న ట్టు వివరించారు. కేవలం పేరు మాత్రమే కాకుండా, బ్యాలెట్‌ పేపర్‌ లేదా ఈవీఎంపై అభ్యర్థి ఫోటోను కూ డా ముద్రించనున్నామన్నారు. తద్వారా ఓటర్లు అసలైన అభ్యర్థిని గుర్తించడం సులభం అవుతుందన్నారు.

ఫిర్యాదుల స్వీకరణ

ఎన్నికల నిర్వహణపై ప్రజలకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే వెబ్‌సైట్‌ ద్వారా లేదా అధికారిక లేఖ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు అని సూచించారు. అయితే ఫిర్యాదు దారులు తప్పనిసరిగా తమ సంతకాన్ని పొందుపరచాలని, అజ్ఞాతంగా వచ్చే ఫిర్యాదులపై చర్యలు తీసుకోవడం కష్టమవుతుందని ఆమె స్పష్టం చేశారు. ఓటరు అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయన్నారు. తాజాగా విడుదల చేసిన మార్గదర్శి రాజకీయ పార్టీలు, ప్రజలు, ఎన్నికల విధులలో ఉండే అధికారులకు అన్ని రకాల ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఇప్పటి వరకు జరిగిన తనిఖీలలో రూ.180 కోట్లకు పైగా నగదు, వస్తువులు సీజ్‌చేశామని వివరించారు.

30 నుంచి నామినేషన్లు

తమిళనాడు ఎన్నికలు 2026 నిమిత్తం మార్చి 30 నుండి నామినేషన్ల పర్వం ప్రారంభం అవుతుందని ప్రకటించారు. ఏప్రిల్‌ 6 వతేదీ వరకు నామినేషన్లు ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 3:00 గంటల వరకు మాత్రమే స్వీకరిస్తారని తెలిపారు.సెలవు దినాల వివరాలు(నామినేషన్లు స్వీకరించని రో జులు మార్చి 31, ఏప్రిల్‌ 01, ఏప్రిల్‌ 03,ఏప్రిల్‌ 05) తేదీలుగా వివరించారు.అభ్యర్థులు తమ నామినేషన్లను నిర్ణీత గడువులోగా, ఏప్రిల్‌ 6వ తేదీ మధ్యా హ్నం 3 గంటల లోపు సంబంధిత ఎన్నికల అధికారులకు సమర్పించాల్సి ఉంటుందని వివరించారు. సె లవు దినాలను మినహాయించి మిగిలిన పనిదినాల్లో మాత్రమే ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement