సాక్షి, చైన్నె : తమిళనాడు రాజకీయాల్లో సీట్ల సర్దుబాటు పర్వం ముగింపు దశకు చేరుకున్న సమయంలో డీఎంకే కూటమిలో కొత్త చర్చ మొదలైంది. నటుడు కమల్ హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యం ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించిన నేపథ్యంలో ఈ కూటమిలోని వీసీకే నేత, ఎంపీ తిరుమావళవన్ డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌కు ఉద్వేగ పూరితంగా బుధవారం లేఖను సంధించారు.
తిరుమావళవన్ లేఖ
మక్కల్ నీది మయ్యం ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా కేవలం మద్దతు తెలపడం అనేది సమంజసంగా లేదని తన లేఖలో తిరుమా వివరించారు. కమల్ హాసన్ వంటి గొప్ప కళాకారుడు, సుమారు 4 శాతం ఓటు బ్యాంకు ఉన్న నాయకుడు అందరితో కలిసి ఎన్నికల బరిలో నిలబడటమే కూటమికి శుభప్రదం అని పేర్కొన్నారు.
టార్చ్‌లైట్ గుర్తుపైనే పోటీకి అవకాశం ఇవ్వండి
కూటమిలోని పార్టీలు తమ సొంత గుర్తుపై పోటీ చేసే స్వేచ్ఛను కలిగి ఉండాలని తిరుమావళవన్ అభిప్రాయపడ్డారు. మిత్రపక్షాలను వేరే పార్టీ గుర్తుపై (ఉదయ సూర్యుడు) పోటీ చేయమని కోరడం వారి రాజకీయ స్వతంత్రతను దెబ్బతీసినట్టు అవుతుందన్నారు. కమల్ హాసన్ పార్టీకి కేటాయించిన టార్చ్‌లైట్ గుర్తుపైనే వారు పోటీ చేసేలా సానుకూల నిర్ణయం తీసుకోవాలి అని కోరారు. ఒక పార్టీ బలాన్ని కేవలం ఓట్ల శాతంతోనే లెక్కించ వద్దని సూచించారు. పార్టీ సిద్ధాంతం, ప్రజల్లో ఆ నాయకుడికి ఉన్న నమ్మకం, గౌరవం కూడా ముఖ్యమేనని, ఈ విషయంలో కమల్ హాసన్ అత్యంత బలమైన నాయకుడు అని ఆయన కొనియాడారు.
బిగ్ బ్రదర్ రోల్ పోషించండి
మతతత్వ, కులతత్వ శక్తులను ఓడించడమే లక్ష్యంగా సాగుతున్న ఈ పోరాటంలో కమల్‌హాసన్ కూడా కూటమిలోని అందరితో పాటూ కత్తి పట్టి యుద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సీట్ల సంఖ్య ఏదైనా కావచ్చని, ఆయన బరిలో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఇది తమరి పెద్దరికాన్ని, కూటమి గౌరవాన్ని మరింత పెంచుతుందని స్టాలిన్‌కు రాసిన లేఖలో తిరుమావళవన్ వివరించారు. కాగా డీఎంకే పార్టీ తన గుర్తుపై (ఉదయ సూర్యుడు) పోటీ చేయాలని ఒత్తిడి తెచ్చిన కారణంగానే కమల్ హాసన్ తప్పుకున్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో, తిరుమావళవన్ చేసిన ఈ వ్యాఖ్యలు కూటమిలో మరింత చర్చకు దారి తీసింది. ఈ విషయంగా స్టాలిన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.


