లక్ష్యం‘ఉదయ సూర్యుడి’ విజయకేతనం | - | Sakshi
Sakshi News home page

లక్ష్యం‘ఉదయ సూర్యుడి’ విజయకేతనం

Mar 26 2026 7:45 AM | Updated on Mar 26 2026 7:45 AM

● 175 స్థానాల్లో డీఎంకే పోటీ ● కేడర్‌కు స్టాలిన్‌ లేఖ

సాక్షి, చైన్నె : 2026 అసెంబ్లీ ఎన్నికలు లక్ష్యం.. ఉదయ సూర్యుడి గెలుపు.. దీనికోసం అవిశ్రాంత సైనికులుగా పనిచేద్దాం అని కేడర్‌, నేతలకు డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్‌ పిలుపు నిచ్చారు. తన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ ఆయన బుధవారం లేఖ రాశారు. ఈ లేఖలో కూటమిలోని ఐక్యత గురించి తొలుత సమగ్రంగా ప్రస్తావించారు. కూటమిలో చీలిక వస్తుందని, వివాదాలు తలెత్తుతాయని ప్రత్యర్థులు ఎదురు చూశారని వ్యాఖ్యలు చేశారు. అయితే, వాటన్నింటిని ఐక్యతతో చిన్నా భిన్నం చేశామన్నారు. ప్రత్యర్థులు ఆశలన్నీ అడియాశలైనట్టు పేర్కొన్నారు.

175 స్థానాల్లో పోటీ

ఈసారి డీఎంకే సొంతంగా 175 నియోజకవర్గాల్లో ఉదయ సూర్యుడు గుర్తుపై పోటీ చేయబోతున్నట్టు ప్రకటించారు. మిగిలిన స్థానాలను మిత్ర ధర్మం మేరకు విపక్షాలు కాంగ్రెస్‌, వీసీకే సీపీఐ, సీపీఎం, ఎండీఎంకే, ఇండియన్‌ యూనియన్‌ ముస్లింలీగ్‌ పార్టీలకు కేటాయించామన్నారు. మక్కల్‌ నీది మయ్యం అధినేత కమల్‌ హాసన్‌ కూటమి విజయం కోసం తీసుకున్న నిర్ణయాన్ని స్టాలిన్‌ ఈసందర్భంగా మనస్ఫూర్తిగా ఆహ్వానించారు.

ప్రజా క్షేత్రంలో ’ద్రవిడ మోడల్‌’

గత పదేళ్ల అన్నాడీఎంకే పాలనలో జరిగిన నష్టాన్ని పూడ్చి, గత ఐదేళ్లుగా తమ ’ద్రవిడ మోడల్‌’ ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని స్టాలిన్‌ పిలుపునిచ్చారు. 234 నియోజకవర్గాలూ మనవే.. ఉదయ సూర్యుడు ఒక్కటే మన గుర్తు కాదు, మిత్ర పక్షాల గుర్తులైన హస్తం, కంకి–కొడవలి, నిచ్చెన, కుండ అన్నీ మనవే అని వివరిస్తూ ప్రతి ఒక్క కార్యకర్త తన సొంత నియోజకవర్గంగా భావించి పని చేయాలని సూచించారు. కాగా, మార్చి 17 నుండి 23 వరకు సుమారు 16,500 మంది ఆశావహులను ఇంటర్వ్యూ చేసినట్టు, రోజూ 10 గంటలకు ఇందుకు సమయం కేటాయించినట్టు వివరించారు. ఇది కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ మతతత్వ రాజకీయాలను ఎదుర్కొంటూ, సామాజిక న్యాయం, రాష్ట్ర హక్కుల కోసం పోరాడే ఈ సెక్యులర్‌ ప్రోగ్రెసివ్‌ అలయన్స్‌ మరోసారి ఘనవిజయం సాధిస్తుందని స్టాలిన్‌ ధీమా వ్యక్తం చేశారు. వదంతులను నమ్మకుండా, లక్ష్యం వైపు దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement