అన్బుమణికి కోర్టు నోటీసులు | - | Sakshi
Sakshi News home page

అన్బుమణికి కోర్టు నోటీసులు

Mar 26 2026 7:45 AM | Updated on Mar 26 2026 7:45 AM

సాక్షి, చైన్నె: ఎన్నికల వేళ పీఎంకేలో అనూహ్య పరిణామాలు చోటు చేసు కుంటున్నాయి. పార్టీ వ్యవస్థాపకుడు రామదాస్‌, తన కుమారుడు , పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు అన్బుమణికి మధ్య తలెత్తిన విభేదంలో తాజాగా కోర్టు జోక్యం చేసుకునేందుకు సిద్ధమైంది. ఈ వివాదం నేపథ్యంలో పార్టీ గుర్తు అయిన మామిడి పండు ఫ్రీజ్‌ చేయాలని కోరుతూ రామదాసు దాఖలు చేసిన పిటిషన్‌పై చైన్నె సివిల్‌ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బుధవారం విచారణ సమయంలో రాందాసు తరపున బలమైన వాదనలు కోర్టులో ఉంచారు. అన్బుమణిని పార్టీ అధ్యక్షుడిగా గుర్తించిన ఎన్నికల సంఘం నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరారు. పార్టీ అంతర్గత సమస్యలు పరిష్కారమయ్యే వరకు మామిడి పండు గుర్తును ఎవరికీ కేటాయించకుండా నిలిపివేయాలని విన్నవించారు. ఈ పిటిషన్‌ను విచారించిన సివిల్‌ కోర్టు న్యాయమూర్తి ధర్మప్రభు, అన్బుమణి వర్గానికి నోటీసు జారీ చేశారు. గురువారం స్పష్టమైన వివరణతో సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. అన్బుమణి తరపు న్యాయవాదులు సమయం కోరగా, సుప్రీంకోర్టు ఆదేశాల దృష్ట్యా, విచారణను ముగించాల్సి ఉందని, గురువారం విచారణ జరుగుతుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

ప్రభావం పడేనా?

అన్నాడీఎంకే కూటమిలో భాగంగా పీఎంకే 18 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఒకవేళ కోర్టు పార్టీ గుర్తును ఫ్రీజ్‌ చేసిన పక్షంలో అభ్యర్థులు ఏ గుర్తు పై పోటీ చేస్తారనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారుతుంది. తండ్రి, తనయుడి వార్గంలో ’చిహ్నం’ ఎవరికై నా దక్కేనా లేదా ప్రీజ్‌ అయ్యేనా అన్నది గురువారం తేలే అవకాశాలు ఉన్నాయి.

3న పుదుచ్చేరిలో మోదీ రోడ్‌ షో

– ఇక, అగ్ర నేతల రాక

సాక్షి, చైన్నె: పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం బీజేపీ అధిష్టా నం కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రచార పర్వంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్‌ 3న పుదుచ్చేరిలో రోడ్‌ షో నిర్వహించనున్నారు. వివరాలు.. పుదుచ్చేరిలోని మరియమ్మన్‌ కోయిల్‌ వీధి (మరై రోడ్డు) లో బీజేపీ రాష్ట్ర విభాగం నేతృత్వంలో కొత్త ఏర్పాటు చేసిన మీడియా కేంద్రాన్ని కేంద్ర మంత్రి, పుదుచ్చేరి ఎన్నికల ఇనన్‌చార్జ్‌ మన్సుక్‌ మాండవియా బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు వి.పి. రామలింగం, మంత్రి నమశ్శివాయం, స్పీకర్‌ ఎన్బలం సెల్వం తదితరులు పాల్గొన్నారు.

అగ్రనేతల ప్రచార హోరు

మీడియా సెంటర్‌ ప్రారంభం అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు వి.పి. రామలింగం విలేకరులతో మాట్లాడుతూ ప్రచార షెడ్యూల్‌ను వివరించారు. ఏప్రిల్‌ 3వ తేదీన ప్రధాని మోదీ పుదుచ్చేరి నగరంలో భారీ రోడ్‌ షో నిర్వహించనున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ఆయన ప్రజలకు పరిచయం చేస్తారు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, జేపీ నడ్డా, జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌ వంటి కీలక నేతలు మార్చి శుక్రవారం నుంచి మూడు రోజులు చొప్పున పుదుచ్చేరిలో వివిధ ప్రాంతాల్లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారని తెలిపారు. ఎన్డీఏ కూటమి అత్యంత పటిష్టంగా ఉందని, బీజేపీ తరపున పోటీ చేస్తున్న 10 మంది అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల సంఘం ఆమోదించిందని రామలింగం తెలిపారు. ప్రతిపక్ష డీఎంకే, కాంగ్రెస్‌ మధ్య నాయకత్వ సమస్యలు ఉన్నాయని, వారి కూటమికి ఎవరు నేతృత్వం వహిస్తారో అన్న స్పష్టత కూడా వారికి లేదని ఆయన ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రధాని మోదీ రోడ్‌ షోతో పుదుచ్చేరిలో ఎన్నికల వాతావరణం పూర్తిగా ఎన్డీఏకు అనుకూలంగా మారుతుందని వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల్లో పోటీ చేయను

– వేల్‌ మురుగన్‌

సాక్షి, చైన్నె : అసెంబ్లీ ఎన్నికలలో తాను పోటీ చేయడం లేదని తమిళర్‌ వాల్వురిమై కట్చి అధ్యక్షుడు, ఎమ్మెల్యే వేల్‌ మురుగన్‌ స్పష్టం చేశారు. డీఎంకే కూటమిలో 2019 నుంచి ఈపార్టీ కొనసాగింది. అయితే, ఈసారి ఎన్నికలలో డీఎంకేలో అధిక స్థానాలను వేల్‌ మురుగన్‌ ఆశించారు.ఇందుకు డీఎంకే నిరాకరించడంతో ద్రావిడ మోడల్‌ ప్రభుత్వంపై అనేక ఆరోపనలు చేస్తూ కూటమి నుంచి బయటకు వచ్చేశారు. ఈ పరిస్థితులలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ ఎన్నికలలో తన పార్టీ తరపున అభ్యర్థులు పోటీ చేస్తార న్నారు. అయితే, తాను పోటీ చేయడం లేదన్నారు. తన అభ్యర్థుల గెలుపునకు శ్రమించనున్నట్టు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement