ఎన్నికల నిబంధనలు ఉల్లంఘన
–అన్నాడీఎంకే నేతలపై కేసు
తిరుత్తణి: ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా సమావేశం నిర్వహించిన అన్నాడీఎంకే మాజీ ఎంపీ హరి సహా ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అధికారులు తనిఖీలు నిర్వహించి కోడ్ ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నారు. ఈక్రమంలో పళ్లిపట్టు సమీపంలోని కొళత్తూరులో ఆదివారం అన్నాడీఎంకే ఆధ్వర్యంలో ఇతర పార్టీల శ్రేణులు అన్నాడీఎంకేలో చేరిక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో 200కు పైగా మహిళలు పాల్గొన్నారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా బహిరంగ కార్యక్రమం నిర్వహించినట్లు తహసీల్దార్ భారతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మాజీ ఎంపీ హరి, ఆ పార్టీ యూనియన్ కార్యదర్శులు శ్రీనివాసన్, రవి, జయవేలు సహా ఐదుగురిపై కేసు నమోదు చేశారు.
మద్యం మత్తులో
యువకుడి వీరంగం
–నిద్రిస్తున్న కూలీపై కత్తితో దాడి
తిరుత్తణి: రోడ్డు పక్కన నిద్రిస్తున్న కూలీని ఓ యువకుడు మద్యం మత్తులో కత్తితో దాడి చేశాడు. పోలీసులు మంగళవారం అతన్ని అరెస్టు చేశారు. పాండిచ్చేరికి చెందిన అరుణ్‌పాండ్యన్(30) తిరుత్తణిలో కూలీ పనులు చేసుకుంటూ రాత్రుల్లో రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లో నిద్రిస్తుంటాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి రైల్వేస్టేషన్ సమీపం రోడ్డు పక్కన నిద్రిస్తుండగా అర్ధరాత్రి సమయంలో తిరుత్తణి స్వాల్‌పేటకు చెందిన వేల్‌మురుగన్(26) మద్యం మత్తులో అరుణ్‌పాండ్యన్‌ను నిద్రలేపి డబ్బులు అడిగాడు. లేదని అతను చెప్పడంతో ఆగ్రహించిన వేల్‌మురుగన్ కత్తితో అరుణ్‌పాండ్యన్‌పై దాడి చేసి పరారయ్యాడు. కేకలు విని చుట్టుపక్కల వారు గాయపడ్డ అత న్ని తిరుత్తణి ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. ప్రథమ చికిత్స అనంతరం తిరువళ్లూరు ప్రభు త్వాస్పత్రికి తరలించారు. తిరుత్తణి పోలీసులు వేల్‌మురుగన్‌ను మంగళవారం అరెస్టు చేశారు.
468 కిలోల గుట్కా స్వాధీనం
–ఇద్దరి అరెస్ట్
తిరువళ్లూరు: ప్రభుత్వ నిషేధిత గుట్కాను తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 468 కిలోల గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గుట్కాను ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే గుట్కా అక్రమ రవాణాను అడ్డుకోవడానికి పోలీసులు వాహనాల తనిఖీలను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే మప్పేడు పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఇరుళంజేరి వద్ద పోలీసులు తనిఖీ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వచ్చిన కారును తనిఖీ చేశారు. తనిఖీల్లో 468 కిలోల గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. కారును సీజ్ చేసి భరత్‌కుమార్, ప్రభాకరన్ అనే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
రైలు ఢీకొని
నవ వధువు దుర్మరణం
అన్నానగర్: పట్టాభిరామ్ రైల్వేస్టేషన్ సమీపంలో రైలు ఢీకొననొ ఒక నవ వధువు మృతిచెందింది. ఆవడి సమీపంలోని పట్టాభిరామ్ చత్రం ప్రాంతానికి చెందిన ప్రభు భార్య సంధ్య (25). చైన్నెలోని ముగప్పేర్ స్కూల్ స్ట్రీట్‌లో నివసించే సంధ్య ఫిబ్రవరి 22న ప్రభును పెళ్లి చేసుకుంది. సోమవారం భర్తతో ఏర్పడిన గొడవ కారణంగా సంధ్య పట్టాభిరామ్ చత్రం ప్రాంతంలోని పుట్టింటికి వచ్చింది. తండ్రి ఆమెకు సర్ది చెప్పి భర్త ఇంటికి పంపించాడు. సంధ్య సోమవారం సాయంత్రం పుట్టింటి నుంచి బయలుదేరి పట్టాభిరామ్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు దాటేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో చైన్నె నుంచి కోయంబత్తూరు వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఆమెని ఢీకొంది. ఈ ఘటనలో ఆమె దుర్మరణం చెందింది. ఆవడి రైల్వే పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం చైన్నెలోని కిల్పాక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంధ్య ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
లంచం కేసులో వీఏఓ అరెస్ట్
అన్నానగర్: లంచం కేసులో గ్రామ పరిపాలనా అధికారి(వీఏఓ) అరెస్ట్‌య్యారు. మదురై జిల్లాలోని ఉసిలంపట్టి ప్రాంతానికి చెందిన ముత్తురామన్. ఇతను తన తండ్రి పేరు మీద ఉన్న భూమిని వారసత్వం ఆధారంగా తన పేరు మీదకు, తన తల్లి, సోదరి పేరు మీదకు బదిలీ చేయించుకోవడానికి ఆన్‌న్‌లైన్‌న్‌లో దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, సంబంధిత వేప్పనుత్తు గ్రామ పరిపాలనాధికారి సుబ్బయ్య, పట్టా బదిలీ చేయించుకోవడానికి ముత్తురామన్ నుంచి రూ. 5వేలు లంచం డిమాండ్ చేసినట్లు తెలిసింది. దీంతో లంచం ఇవ్వడానికి ఇష్టపడని అతను ఏసీబీ పోలిసులకు ఫిర్యాదు చేశాడు. ఏసీబీ పోలీసులు రసాయనాలు కలిపిన కరెన్సీని వీఏఓ సుబ్బయ్యకు ఇవ్వాలని ముత్తురామన్‌న్‌కు ఇచ్చారు. సోమవారం సాయంత్రం సుబ్బయ్యకు ముత్తరామన్ ఇస్తుండగా ఏసీబీ పోలీసులు అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని అరెస్టు చేశారు.


