ఉచితాల వెల్లువ | - | Sakshi
Sakshi News home page

ఉచితాల వెల్లువ

Mar 25 2026 7:21 AM | Updated on Mar 25 2026 7:21 AM

పళణి మ్యానిఫెస్టో విడుదల పురుషులకు ఇక బస్సుల్లో ఫ్రీ ఇంటింటికి ఫ్రిడ్జ్‌ అధికారంలోకి రాగానే ఖర్చులకు రూ. 10 వేలు అధికారం కోసం 297 వాగ్దానాలు

సాక్షి, చైన్నె : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి మంగళవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎన్నికల మేని ఫెస్టోను విడుదల చేశారు. అధికారం లక్ష్యంగా 297 వాగ్ధానాలు వెల్లడించారు. ఇందులో ఉచిత పథకాలు వెల్లువెత్తాయి. వివరాలు.. అన్నాడీఎంకే కూటమిలో సీట్ల లెక్కలు తేల్చేశారు. బీజేపీకి 27, అన్బుమణి పీఎంకేకు 18, దినకరన్‌ అమ్మ మక్కల్‌ మున్నేట్రకళగంకు 11 సీట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక జీకే వాసన్‌ తమిళ మానిల కాంగ్రెస్‌కు ఐదు, ఏసీ షణ్ముగం పుదియ నీతి కట్చి, ఎన్‌ఆర్‌ ధనపాలన్‌ పెరుంతలైవర్‌ మక్కల్‌ కట్చి, జగన్‌ మూర్తి పురట్చి భారతం, జాన్‌ పాండియన్‌ తమిళగ మున్నేట్ర కళగం, పారివేందర్‌ ఐజేకేలకు తలా ఒకటి లేదా, రెండు స్థానాలు కేటాయిస్తూ, రెండాకు చిహ్నంలో పోటీ చేసే విధంగా మెలిక పెట్టినట్టు సమాచారాలు వెలువడ్డాయి. ఈ పరిస్థితులలో బుధవారం నుంచి ఎన్నికల ప్రచారానికి పళణి స్వామి సిద్ధమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రచార పర్యటనకు చైన్నె నుంచి శ్రీకారం చుట్టనున్నారు. దీంతో పార్టీ తరపున మేనిఫెస్టో కమిటీ రూపొందించిన వాగ్దానాల జాబితాను మంగళవారం సాయంత్రం పార్టీ కార్యాలయం ఎంజీఆర్‌ మాళిగైలో విడుదల చేశారు.

వాగ్దానాలలో కొన్ని..

● గృహిణుల కోసం బియ్యం కార్డు కలిగిన వారికి ఉచితంగా ఒక ఫ్రిజ్‌ ఇవ్వనున్నారు.

● పెరిగిన ధరల నుండి ప్రజలు ఉపశమనం పొందేందుకు ప్రతి కుటుంబానికి అధికారంలోకి రాగానే రూ. 10 వేలు ప్రత్యేక ఆర్థిక సాయం అందించనున్నారు.

● ప్రతి కుటుంబంలోమహిళకు నెలకు రూ. 2 వేలు బ్యాంక్‌ ఖాతాలో జమ చేస్తారు.

● మహిళలతో పాటు ఇకపై పురుషులకు కూడా సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు.

● విద్యార్థుల తీసుకున్న బ్యాంక్‌ విద్యా రుణాల రద్దు

● పట్టభద్రులకు నెలకు రూ. 2 వేలు, ప్లస్‌టూ చదివిన వారికి నెలకు రూ. 1000 అందజేయనున్నారు.

● క్వింటాల్‌ వరికి రూ. 3,500, టన్ను చెరకుకు రూ.4,500 ధర నిర్ణయం.

● చిన్న, సన్నకారు రైతులకు ఎరువులు, విత్తనాల కోసం హెక్టారుకు రూ. 15 వేలు సాయం

● 100 రోజుల ఉపాది కల్పనను 150 రోజులకు పెంపు.

● ఏడాదికి 3 ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పంపిణి

● రేషన్‌ దుకాణాలలో ఉచిత బియ్యంతో పాటు ఒక కిలో పప్పు, ఒక లీటర్‌ వంట నూనె ఉచితం.

● ‘అమ్మ మినీ క్లినిక్‌ల’ పునరుద్ధరణ, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వైద్య కోటా సీట్లను 7.5% నుండి 10%కి పెంపు.

● రాష్ట్రంలో దశలవారీగా మద్యం దుకాణాల మూసివేత

● తాళికి బంగారం, పెళ్లి కానుక పథకాలను కొనసాగిస్తూ, పెళ్లి కుమార్తెలకు పట్టు చీరలు, పెళ్లి కుమారులకు పట్టు పంచె–చొక్కా అందజేయనున్నారు.

● ‘మేము అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాం’ అనే నినాదంతో అన్నాడీఎంకే ఈ ఎన్నికల బరిలోకి దిగుతోందని ప్రకటిస్తూ మొత్తం 297 వాగ్దానాలు ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement