రంగంలోకి 2,169 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు | - | Sakshi
Sakshi News home page

రంగంలోకి 2,169 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు

Mar 25 2026 7:21 AM | Updated on Mar 25 2026 7:21 AM

● ప్రత్యేకంగా 2166 సిట్టింగ్‌ స్క్వాడ్‌లు ● 178 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం

సాక్షి, చైన్నె: తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నాటి నుండి ఎన్నికల నియమావళి అత్యంత కఠినంగా అమలు చేయబడుతోంది. ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అర్చన పట్నాయక్‌ నేతృత్వంలో నిఘా వ్యవస్థను ముమ్మరం చేశారు. ఎన్నికల అక్రమాలను అరికట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్లు: మొత్తం 2,169 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు రంగంలోకి దిగాయి. ఇక, 24 గంటల పాటు నిరంతర నిఘాతో వ్యవహరించనున్నారు. కీలక ప్రాంతాల్లో మరో 2,166 సిట్టింగ్‌ బృందాలు, వాహన తనిఖీలు చేపట్టే విధంగా చర్యలు తీసుకున్నారు. సీ విజిల్‌ యాప్‌పై ప్రత్యేక దృష్టి పెడుతూ, ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులపై ఈ బృందాలు తక్షణమే పరిష్కరంచనున్నారు.

భారీగా పట్టుబడిన నగదు, బంగారం

ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినప్పటి నుండి మంగళవారం వరకు అధికారులు జరిపిన తనిఖీల్లో రూ. 178.78 కోట్ల విలువైన నగదు, వస్తువులు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ప్రభుత్వ , ప్రైవేట్‌ ఆస్తులపై అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన రాజకీయ ప్రకటనలను అధికారులు తొలగించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 7,10,362 వాల్‌ పెయింటింగ్స్‌, పోస్టర్లు , బ్యానర్లను తొలగించినట్లు ప్రకటించారు. నియమావళిని ఉల్లంఘించినందుకు ఇప్పటివరకు 544 ఎఫ్‌ఐఆర్‌ లు నమోదయ్యాయి. అత్యధికంగా మదురై (190), తేని (183) జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి.

సరిహద్దు రాష్ట్రాలతో సమీక్ష

ఎన్నికలు సజావుగా సాగేలా పొరుగు రాష్ట్రాలైన కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, పుదుచ్చేరి అధికారులతో భారత ఎన్నికల సంఘం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించింది. సరిహద్దుల గుండా అక్రమ మద్యం, నగదు రవాణా కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా, ఏప్రిల్‌ 9 నుంచి 29వ తేదీ వరకు ఎలాంటి సర్వేలు, అభిప్రాయాల సేకరణకు నిషేధం విధిస్తూ అర్చనా పట్నాయక్‌ ప్రకటన చేశారు. కాగా, ఆయా నియోజకవర్గాలకు ఈవీఎం, వీవీ పాడ్‌ల పంపిణికి మంగళవారం శ్రీకారం చుట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement