సాక్షి, చైన్నె: కొలొరెక్టల్ క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా, గ్యాస్ట్రో ఎంటరాలజీ. లాపరోస్కోపిక్ సంస్థ జెమ్ హాస్పిటల్ కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడు ప్రభుత్వ పెన్షనర్ల కోసం ఉచిత కొలొరెక్టల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆసుపత్రి యాజమాన్యం సోమవారం ు ప్రకటించింది. గ్లోబల్ క్యాన్సర్ డేటా ప్రకారం, భారతదేశంలో ఏటా సుమారు 65,000 కొత్త కొలొరెక్టల్ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని, ఇందులో సుమారు 38,000 మరణాలు సంభవిస్తున్నట్టు వైద్యులు ప్రకటించారు. దీనిపై విస్తృతంగా అవగాహన సదస్సుల నిర్వహణకు సిద్ధమయ్యారు. ఇందులోభాగంగా వైద్యులు ఈ వ్యాధికి సంబంధించిన కొన్ని ముందస్తు హెచ్చరిక సంకేతాలను వివరించారు. మలంలో రక్తం పడటం. కారణం లేకుండా బరువు తగ్గడం. కడుపులో నిరంతరం అసౌకర్యంగా ఉండటం వంటి అంశాలు ఉంటే తమను సంప్రదించాలని వైద్యులు పేర్కొన్నారు.జెమ్ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ సి పళణి వేలు , డైర్టెర్ డాక్టర్ పి. సెంథిల్ నాథన్ మాట్లాడుతూ ప్రభుత్వ పెన్షనర్లకు నివారణ వైద్యం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ ఉచిత స్క్రీనింగ్ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. కోలనోస్కోపీ వంటి పరీక్షల ద్వారా క్యాన్సర్ రాకముందే పాలిప్స్‌ను గుర్తించి అరికట్టవచ్చని సూచించారు. ఈ సందర్భంగా క్యాన్సర్‌ను జయించిన క్యాన్సర్ వారియర్స్‌ను ఆసుపత్రి ఘనంగా సన్మానించింది. 45 ఏళ్లు దాటిన వారు లేదా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవారు తప్పనిసరిగా క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు.


