క్లుప్తంగా
అన్నామలైయార్ సన్నిధిలో శివకార్తికేయన్
వేలూరు: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలో సినీ నటుడు శివకార్తికేయన్ దంపతులు బుధవారం సాయంత్రం స్వామి దర్శనం చేసుకున్నారు. ముందుగా ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం శివాచార్యులు వేద మంత్రాల నడుమ ఆయనకు ప్రత్యేక దర్శనం కల్పించి ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామి వారి ప్రసాదాలను అందజేశారు. శివకార్తికేయన్ ఆలయానికి వచ్చిన విషయం తెలుసుకున్న భక్తులు ఆయన్ను చూసేందుకు పోటీ పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో ఆయనతో సెల్ఫీ తీసుకునేందుకు ఎగబడ్డారు. పోలీసులు అనుమతించకపోవడంతో భక్తులు నిరాశతో వెనుదిరిగారు.
నల్లంబాక్కం సరస్సులో
గుర్తు తెలియని మృతదేహం
కొరుక్కుపేట: వండలూర్ సమీపంలోని నల్లంబాక్కం సరస్సులో బుధవారం ఓ వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతను హత్యకు గురయ్యాడా లేదా మరేదైనా కారణం ఉందా అనే దానిపై వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడి ముఖం పూర్తిగా ఛిద్రమై ఉందని తెలిపారు.
లారీ ఢీకొని డ్రైవర్ మృతి
తిరువళ్లూరు: తిరువళ్లూరు సమీపంలో లారీ ఢీకొని ఓ డ్రైవర్ మృతిచెందాడు. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ ఎగువనల్లాటూరు ప్రాంతానికి చెందిన సంతానరాజ్(40). ఇతను మినీ లారీడ్రైవర్. ఈ క్రమంలో సంతానరాజ్ తన వాహనానికి స్పేర్‌పార్ట్ తీసుకోవడానికి బైక్‌లో ఎగువనల్లాటూరు గ్రామం నుంచి తిరువళ్లూరు బయలుదేరాడు. వస్తువులను కొనుగోలు చేసి తిరిగి బైక్లో బయలుదేరాడు. మనవాలనగర్ సమీపంలో వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన సిమెంట్ లారీ బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో సంతానరాజ్ సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీవారి దర్శనానికి
6 గంటలు
తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ సాధారణగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 4 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. బుధవారం అర్ధరాత్రి వరకు 70,509 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 18,058 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.20 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 06 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారి ని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.
ఎల్లలు దాటిన ప్రేమ
– అమెరికా అమ్మాయి.. తిరుపతి అబ్బాయి
– సందడిగా నిశ్చితార్థం
తిరుపతి రూరల్: అమెరికా అమ్మాయి.. ఆంధ్రా అబ్బాయి నిశ్చితార్థం తిరుపతిలో అట్టహాసంగా జరిగింది. తిరుపతికి చెందిన విశ్రాంత బీఎస్‌ఎన్‌ఎల్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ రాజేంద్రన్‌పెద్ద కుమారుడు రికీ జోసెఫ్ రాజేంద్రన్(35) అమెరికాలో పీహెచ్‌డీ పూర్తిచేసి ఓ కంపెనీలో కన్సల్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. మిచిగన్ రాష్ట్రం డెట్రాయిట్‌లో ఉంటున్న అతనికి అమెరికా యువతి బ్రాండి నొయెల్లె జెడ్ (30)తో పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. ఇరు కుటుంబాల పెద్దలు వారి ప్రేమను ఆమోదించారు. బుధవారం తిరుపతి రూరల్ మండలం ఉప్పరపల్లెలోని ఓ హోటల్లో నిశ్చితార్థం వేడుకగా నిర్వహించారు. అక్టోబర్‌లో అమెరికాలో వివాహం చేస్తామని బ్రాండీ తల్లిదండ్రులు చెప్పడంతో సుముఖత వ్యక్తం చేసినట్టు రాజేంద్రన్ తెలిపారు. నిశ్చితార్థం కార్యక్రమాన్ని వీడియో కాల్‌లో అమెరికా నుంచి బ్రాండీ తల్లిదండ్రులు, బంధువులు వీక్షించారు. తనకు భారతీయ సంస్కృతి, ఆహారపు అలవాట్లు నచ్చాయని బ్రాండీ చెప్పారు.
క్లుప్తంగా
క్లుప్తంగా


