మహిళలు వర్ధిల్లాలి!
సాక్షి, చైన్నె: మహిళలు వర్ధిల్లాలి నినాదంతో డీఎంకే ఇంటింటా ప్రచారానికి నిర్ణయించింది. ఈనెల 23 నుంచి మార్చి 8వ తేదీ వరకు ఈ ప్రచారం జరగనుంది. డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ ఈ మేరకు బుధవారం ప్రకటించారు. అన్నా అరివాలయంలో జరిగిన జిల్లా కార్యదర్శుల సమావేశంలో మహిళల కోసం ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించాలని ప్రకటించారు. ఈ ప్రచారం ఫిబ్రవరి 23 నుండి మార్చి 8 వరకు ఇంటింటికీ చేరేలా నిర్వహించాలని ఆదేశించారు. తమిళ మహిళలకు డీఎంకే ప్రభుత్వ సంక్షేమ పథకాలును వివరించడం, మహిళల హక్కులు, ఆర్థిక మద్దతులు, అభివృద్ధి కల్పించే విధంగా అవగాహన కార్యక్రమాలతో ఇంటింటా ప్రచారానికి నిర్ణయించారు.
ఈ ప్రచార కార్యక్రమాలకు హాజరయ్యే ప్రతినిధులకు ఈనెల 20,21,22 తేదీలలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా శిక్షణ ఇవ్వనున్నారు. కాగా, గత వారం సీఎంస్టాలిన్ మహిళల బ్యాంక్ ఖాతాలో రూ. 5 వేలు నగదు జమ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ప్రతి పోలింగ్ కేంద్రంలో 10 మంది మహిళ బృందాల ఏఆర్పటుతో ఒక్కో బృందం ద్వారా స్థానికంగా మహిళల మద్దతు సేకరణకు సిద్ధమయ్యారు. జోనల్ ఇన్‌చార్జ్‌లు, ఇన్‌చార్జ్ మంత్రులు, జిల్లా కౌన్సిలర్లు, మహిళాబృంద నాయకులు ఇంటింటా ప్రచారంలో భాగస్వామ్యం కావాలని స్టాలిన్ ఆదేశించారు. ఈ ప్రచారం ద్వారా, డీఎంకే పార్టీ మహిళలలో అవగాహనను పెంచి, 2026 ఎన్నికల్లో విజయాన్ని సాధించడానికి సన్నద్ధమైంది.


