కమణీయం..ఆదిదంపతుల కల్యాణం
ఆదిదంపతుల కల్యాణం భక్తుల కోలాహలం మధ్య కమనీయంగా సాగింది. భక్తులను అనుగ్రహించడానికి బహిరంగంగా పార్వతీ, పరమేశ్వరులు జరుపుకున్న వివాహ మహోత్సవం భక్తజన కోటిని పరవశింపజేసింది. అశేష భక్తజన వాహిని మధ్య ఆదిదంపతుల కల్యాణం అంగరంగ వైభంగా సాగింది. బుధవారం తెల్లవారు జామున సుమారు 4.30గంటల సమయంలో జ్ఞానప్రసూనాంబదేవికి శ్రీకాళహస్తీశ్వరుడు వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ మాంగల్యధారణ చేశారు. ఇదే శుభ ఘడియల్లో ఆదిదంపతుల సమక్షంలో 59 నూతన జంటలు వివాహం చేసుకుని ఒకటయ్యాయి.
శ్రీకాళహస్తి: ముక్కంటి క్షేత్రంలో పెళ్లి కళ ఉట్టిపడింది. మహాశివరాత్రి బ్రమ్మోత్సవాల్లో భాగంగా బుధవారం వేకువజామున ఆదిదంపతుల కల్యాణం కమనీయంగా సాగింది. అంతకు ముందు మంగళవారం రాత్రి ఆలయంలోని అలంకార మండపంలో స్వామి, అమ్మవార్లను బంగారు ఆభరణాలతో అలంకరించి వేదోక్తంగా పూజలు చేశారు. అనంతరం స్వామివారిని గజ వాహనంపై, అమ్మవారిని సింహ వాహనంపై అధిష్టింపజేసి పెండ్లిమండపం వద్దకు తీసుకొచ్చారు.
అలిగితివా సఖీ!
పెండ్లిమండపం వద్దకు మొదట పరమేశ్వరుడు చేరుకోగా.. మధ్యలో పార్వతీదేవి అలకబూనడంతో చండికేశ్వరుడు మధ్యవర్తిత్వం చేసి అమ్మవారి అలక తీర్చారు. అందకు సంతృప్తి చెందిన జ్ఞానప్రసూనాంబ పెండ్లి మండపం వద్దకు చేరుకున్నారు. పరమేశ్వరుడు, పార్వతీదేవి పెళ్లి పీటలపై ఆశీనులయ్యారు. వేదపండితుల కలశ స్థాపన చేశారు. సంకల్పం, యజ్ఞాహుతి పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆదిదంపతుల కల్యాణ ఘటన్ని పూర్తిచేశారు. శివపార్వతుల పెళ్లిని వీక్షించడానికి భక్త జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నగరి వీధి, నెహ్రూ వీధి భక్తులతో నిండిపోయాయి. ఈ కార్యక్రమంలో పాలకమండలి చైర్మన్ కొట్టే సాయి, ఈవో బాపిరెడ్డి, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
ఒక్కటైన నూతన జంటలు
స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం సందర్భంగా 59 నూతన జంటలు ఏకమయ్యాయి. నూతన వధూవరులకు ముక్కంటి ఆలయం తరఫున మంగళ సూత్రాలు, పసుపు, కుంకుమ, గాజులు, దుస్తులు అందజేశారు. జ్ఞానప్రసూనాంబ దేవికి మాంగల్యధారణ చేసిన సమయంలోనే ఈ జంటలు ఒక్కటయ్యాయి.


