రానున్న ఎన్నికల్లో..
సాక్షి,చైన్నె : సినీ నటుడిగా అశేషాభిమానుల హృదయాల్లో దళపతిగా గుర్తింపు పొందిన విజయ్ తమిళగ వెట్రి కళగం పార్టీని 2024 ఫిబ్రవరి 2న ప్రకటించిన విషయం తెలిసిందే. పార్టీ ఆవిర్భావ సమయంలో 2026 అసెంబ్లీ ఎన్నికలే తన లక్ష్యమని స్పష్టం చేస్తూ, అప్పట్లో లోక్‌సభ ఎన్నికలను సైతం బహిష్కరించారు.
ఈ ఎన్నికల అనంతరం పార్టీ జెండాను విజయ్ ఆవిష్కరించారు. రెండో వార్షికోత్సవం నుంచి పూర్తి స్థాయిలో రాజకీయాలలో మునిగిన విజయ్ పార్టీని బలోపేతం చేస్తూ వస్తున్నారు. పార్టీ పరంగా 120 జిల్లాలను ఏర్పాటు చేసి కమిటీలను ప్రకటించారు. ద్రావిడ పార్టీలకు భిన్నంగా తన రాజకీయ ప్రయాణాన్ని సాగిస్తూ వస్తున్న విజయ్ నేతృత్వంలోని టీవీకే సోమవారం మూడో వసంతంలోకి అడుగు పెట్టింది.
రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు
ఫిబ్రవరి 2న పార్టీ ఏర్పాటు చేసి రెండేళ్లు పూర్తి చేసుకుని, మూడో వసంతంలోకి అడుగు పెట్టిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కేడర్ సేవా కార్యక్రమాలతో ముందుకు సాగారు. వాడవాడలా పార్టీ జెండాలను ఆవిష్కరించారు. 234 అసెంబ్లీ నియోజకవర్గాలలో అన్నదానం, రక్తదానం, విద్య, వైద్య పరమైన సేవా కార్యక్రమలు నిర్వహించారు. చైన్నె పనయూరులో బ్రహ్మాండ కార్యక్రమానికి చర్యలు తీసుకున్నారు. పంచమూర్తుల సూత్రాలే తమ ఆదర్శం అని ఇప్పటికే విజయ్ ప్రకటించిన నేపథ్యంలో కర్మయోగి కామరాజర్, ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్, భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్, వీర నారీ మణులు, వేలునాచ్చియార్, అంజలై అమ్మాల్ విగ్రహాలకు ఉదయాన్నే విజయ్ పుష్పాంజలి ఘటించారు. పార్టీ జెండాను ఆవిష్కరించినానంతరం పంచమూర్తుల విగ్రహాలకు పూల మాలలు వేసి, పుష్పాంజలి ఘటించారు. సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆ చిత్రంలోని పాటకు విజయ్ సైతం స్టెప్పులు వేయడం విశేషం. అనంతరం పార్టీ నిర్వాహకులతో సమావేశమయ్యారు.
డీఎంకేకు పరిపాటే..
విజయ్ ప్రసంగిస్తూ ఎవరైతే వ్యతిరేకిస్తారో వారిని టార్గెట్ చేసి కుట్రలు, కుతంత్రాలు చేయడం డీఎంకేకు పరిపాటేనని మండిపడ్డారు. డీఎంకే పాలనను చూసిన తర్వాత తమిళనాడు ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని వ్యాఖ్యలు చేశారు. దివంగత నేతలు కామరాజ్, ఎంజీఆర్, అన్నాదురై నేటికీ ప్రజల హృదయాలో చిరస్మరణీయంగా పేర్కొన్నారు. తమిళనాడులో ఎవరు రాజకీయాల్లోకి వచ్చినా, వారిని ఉద్దేశించి మీ అనుభవం ఏమిటో..? అని డీఎంకే ప్రశ్నిస్తున్నట్టు గుర్తు చేశారు. ఎంజీఆర్‌కు రాజకీయలే తెలుసా అని వారు ప్రశ్నించారని, కామరాజ్ కు సాహిత్యం తెలుసా అని వారే ప్రశ్నించారని, నేడు టీవీకేను చూసి భయంతో ఆందోళనతో ప్రశ్నలు గుప్పిస్తున్నారన్నారు. డీఎంకే అవినీతిని ఎత్తి చూపకుండా తాము ఉండలేమని, టీవీకే ప్రతినిధులు మాత్రమే ఈ రాష్ట్రంలో డీఎంకేను ప్రశ్నిస్తున్నారని, తప్పులను ఎత్తి చూప్తున్నారని, విమర్శలు గుప్పిస్తున్నారని వివరించారు. ఈ డిజిటల్ ప్రపంచంలో తిరువల్లువర్ ఉండి ఉంటే, తిరుక్కురల్ డీఎంకే అనే దుష్టశక్తి గురించి అన్యాయం, అరాచకం, అవినీతి, మయం డిఎంకె ప్రపంచం అని రాసి ఉండే వారని ఎద్దేవా చేశారు. తమిళనాడు ఎన్నికల రంగంలో త్రిముఖ పోటీ, చతుర్ముఖ పోటీ అంటున్న వారికి తాను ఒక్కటే చెబుతున్నానని వివరించారు. ఇక్కడ అతి పెద్ద దివ్య శక్తిగా టీవీకే ఉందని, దుష్టశక్తి డీఎంకే, పాసిస్టు శక్తి బీజేపీల నేతృత్వంలోని కూటముల మధ్యే ఇక్కడ సమరం అని స్పష్టం చేశారు. బీజేపీ నేతృత్వంలోనే కూటమి ఉందంటూ పరోక్షంగా అన్నాడీఎంకే నేతృత్వంలో కూటమి అన్నది లేదని, బీజేపీ అండ్ పలువురు అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
విజయం ఖాయం
ఇప్పుడు కొందరు కొత్తగా విజయ్ ఇంటి నుంచి బయటకు రాడబ్బా అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారని గుర్తు చేస్తూ, కొంచం ఓపిక పట్టండి బాస్ అంటూ ఎన్నికల రోజున తమిళనాడులోని ప్రతి ఇంట్లో ఈ విజయం ఓటరు ఐడీ కార్డుతో బూత్ ముందు నిలబడుతాడని వ్యాఖ్యలు చేశారు. అప్పుడు చెప్పండి ఈ విజయ్ ఎందుకు వచ్చాడ్రా? ఎందుకు బయటకు పిలిచాం? అని అంటూ వ్యాఖ్యల తూటాలను పేల్చారు. తాను ఏం చెప్పినా, వాళ్లేమో ఇదో సినిమా అని వ్యాఖ్యలు చేయడం సహజంగా మారిందని, తాను సినిమాను వదలుకునేందుకు సిద్ధమైనా, వాళ్లు మాత్రం వదలుకోవడానికి ఇష్ట పడనట్టుందని చమత్కరించారు. ఎన్నికలకు సంబంధించి కొన్ని అభిప్రాయ సేకరణలు ఇటీవల కాలంగా వస్తున్నాయని గుర్తు చేశారు. వాటిలో కొన్ని సరైనవే అని పేర్కొంటూ ’విజిల్ గుర్తుకు ఓటు వేయకుండా ఎవరిని ఆపలేరని పేర్కొంటూ ఇది కేవలం ఆశ మాత్రమే కాదని, క్షేత్ర స్థాయిలో తాజాగా ఉన్న పరిస్థితిగా పేర్కొన్నారు. తమిళనాడు ప్రజలకు ఇప్పుడు టీవీకే ఒక్కటే మార్గం అని పేర్కొంటూ, డబ్బా ఇంజిన్ వచ్చినా, చిల్లు పడ్డ ఇంజిన్ వచ్చినా, అత్యుత్తమ ఇంజిన్ టీవీకే అని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలతో మమేకమై కష్టపడి పనిచేయాలని, ప్రతి కుటుంబం వద్దకు వెళ్లాలని, టీవీకేకు ఓటు వేయమని కోరాలని పిలుపు నిస్తూ, ఈ ఎన్నికలలో విజయం మనదే అని ధీమా వ్యక్తం చేశారు. సెయింట్‌జార్జ్ ఫోర్టులో పాలక పార్టీగా ఎదగబోతున్నామని, విజయం ఖాయం అని ముగించారు. ఈ సమావేశంలో టీవీకే నేతలు భుస్సీ ఆనంద్, సెంగొట్టయ్యన్, ఆదవ్ అర్జున, నిర్మల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రానున్న ఎన్నికల్లో..


