ప్రపంచ పర్యాటక చిత్రంలోకి తమిళనాడు
మమాల్లపురానికి మరింత శోభ
స్పెషల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు
విస్తతంగా పర్యాటక పెట్టుబడుల ఆహ్వానం
కుమరి, కళ్లకురిచ్చి, ఈరోడ్,
తూత్తుకుడిలలో పర్యాటక హబ్‌లు
తమిళనాడు గ్లోబల్ టూరిజం సమ్మిట్‌లో సీఎం స్టాలిన్
ప్రపంచ పర్యాటక చిత్ర పటంలో కళ, సంస్కృతి పరంగా తమిళనాడు పర్యాటక కేంద్రం అవతరించనున్నట్టు సీఎం ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు. మామల్లపురానికి మరింత శోభ తెచ్చే విధంగా స్పెషల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. రూ. 100 కోట్లతో ప్రపంచ స్థాయి, ఆధునిక పర్యాటక మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు కల్పిస్తామని ప్రకటించారు.
సాక్షి, చైన్నె: చెంగల్పట్టు జిల్లా మహాబలిపురం (మామల్లపురం)లో తమిళనాడు గ్లోబల్ టూరిజం సమ్మిట్ 2026 సోమవారం జరిగింది. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధిని వేగవంతం చేయడం, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సమ్మిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా తమిళనాడు పర్యాటక రంగాన్ని మరింత మెరుగుపరచేందుకు వివిధ జాతీయ, అంతర్జాతీయ పర్యాటక సంస్థలతో 127 అవగాహన ఒప్పందాలు జరిగాయి. వీటి ద్వారా మొత్తం రూ.22,794.78 కోట్ల పెట్టుబడులు రావడమే కాకుండా, సుమారు 65,937 మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సిద్ధమయ్యారు. ఈ ఒప్పందాలన్నీ సీఎంస్టాలిన్ సమక్షంలో జరిగాయి. అలాగే సాంప్రదాయ పర్యాటకం, సాహస పర్యాటకం, ఎంఐసీఈ పర్యాటకం, పర్యావరణ పర్యాటకం, వెల్నెస్ , వైద్య పర్యాటకం, డిజిటల్ టూరిజం వంటి విభిన్న రంగాల అభివృద్ధిపై ఈ సమ్మిట్ ద్వారా దృష్టి పెట్టారు. తమిళనాడులోని పురాతన దేవాలయాలు, ప్రకృతి సౌందర్యం, రమణీయత కలిగిన పర్వతాలు, అడవులు, బీచ్‌లు వంటి పర్యాటక ఆకర్షణలను ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యంగా ఈ సమ్మిట్‌లో నిర్ణయం తీసుకున్నారు. ఈ సమ్మిట్‌లో భాగంగా నిర్వహించిన టూరిజం ఇన్నోవేషన్ హ్యాకథాన్లో జేరా రోబోటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, తమిళ్ నిలం, తమిళ్ పన్నై, , ఓర్టస్ ఇండియా టూరిజం ప్రైవేట్ లిమిటెడ్‌లు విజేతలుగా నిలిచాయి. విజేతలు ఒక్కొక్కరికి రూ.లక్ష నగదు బహుమతిని సీఎం అందజేశారు. అలాగే పర్యాటక అభివృద్ధిలో భాగంగా రూ.40.25 కోట్ల వ్యయంతో పూర్తయిన పలు ప్రాజెక్టులను ముఖ్యమంత్రి ప్రజల వినియోగానికి తీసుకొచ్చారు. రూ.8 కోట్ల అంచనా వ్యయంతో రెండు కొత్త పర్యాటక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమానికి పలువురు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ మురుగానందం, భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తదితరులు హాజరయ్యారు.
సుదీర్ఘ లక్ష్యాలు
ఈ సమ్మిట్‌లో సీఎం స్టాలిన్ మాట్లాడుతూ ప్రపంచ పర్యాటక శిఖరాగ్ర సమావేశానికి తన పూర్తి మద్దతును ప్రకటించారు. ప్రత్యేక అతిథిగా హాజరై తమిళనాడు అందాల గురించి క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ వివరించారని గుర్తు చేస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. తమిళ సౌందర్యం, మన నాగరికత , ప్రాచీనతపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని వ్యవస్థాపకులకు తెలుసునని పేర్కొంటూ కళలు, సంస్కృతిని ప్రపంచ చిత్ర పటంలో చేర్చే దిశగా తమిళనాడులో పర్యాటక రంగాన్ని మెరుగుపరచడమే తన లక్ష్యంగా ప్రకటించారు.
విస్తృతంగా పెట్టుబడుల ఆకర్షణ
గత ఐదు సంవత్సరాలలో పర్యాటక పరిశ్రమ అభివృద్ధి కోసం రూ. 612 కోట్లను కేటాయించామని గుర్తుచేస్తూ, గత ఐదు సంవత్సరాలలో దేశీ పర్యాటకలు 128 కోట్ల 97 లక్షల మంది, విదేశీ పర్యాటకులు 4.5 మిలియన్ల మంది తమిళనాడుకు వచ్చినట్టు వివరించారు. ఇక్కడున్న అద్బుత రవాణా సౌకర్యం, పర్యాటకం, సురక్షితమైన రాష్ట్రం, సాహస పర్యాటకం, వినోద పర్యాటకం , కారవాన్ పర్యాటకం, గ్రామీణ , కొండప్రాంత పర్యాటకం – తీరప్రాంత పర్యాటకం, సాంస్కృతిక పర్యాటకం, వైద్య , వెల్నెస్ పర్యాటకం, ఆధ్యాత్మిక పర్యాటకం, ఎకోటూరిజం , హెరిటేజ్ టూరిజం , ఫిల్మ్ టూరిజంల ప్రగతిని కాంక్షిస్తూ పర్యాటక విధానం 2023ని ఆవిష్కరించామని వివరించారు. ‘తమిళ్ బిన్నెలే’ పేరుతో వచ్చే ఏడాది జనవరిలో కళా–సాంస్కృతిక ప్రపంచ స్థాయి పర్యాటక ఈవెంట్ నిర్వహణ నిర్ణయించామని ప్రకటించారు. కాగా, మార్గ మధ్యలో నావలూరు చెరువును పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు రూ. 30 కోట్లతో చేపట్టిన పనులను సీఎం పరిశీలించారు.
ప్రపంచ పర్యాటక చిత్రంలోకి తమిళనాడు


