11న పుదుచ్చేరికి పీఎం మోదీ
సాక్షి, చైన్నె: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్‌డీఏ కూటమి పార్టీల మహానాడుకు కసరత్తు చేపట్టారు. ఈ మహానాడుకు ప్రధాని నరేంద్రమోదీ హాజరు కానున్నారు. కూటమి నేతలను ఒకే వేదిక మీదకు తీసుకు రానున్నారు. వివరాలు.. తమిళనాడుతో పాటూ పొరుగున ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోనూ మరో రెండు నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇక్కడ ఎన్‌ఆర్ కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వం తాజాగా అధికారంలో ఉంది. మళ్లీ అధికారం దిశగా ఎన్‌ఆర్ కాంగ్రెస్ నేత రంగస్వామి వ్యూహాలకు పదును పెట్టారు. ఈ పరిస్థితులలో తమిళనాడులో వలే పుదుచ్చేరిలోనూ కూటమిపార్టీల నేతలను ప్రధాని నరేంద్రమోదీ సమక్షంలో ఒకే వేదికపైకి తెచ్చేందుకు రంగస్వామి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఈనెల11న లాజ్ పేట విమానాశ్రయ మైదానంలో మహానాడుకు సిద్ధమయ్యారు. ఈ మహానాడుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఈ మహానాడు తదుపరి బీజేపీ కార్యకర్తల సమావేశంలో మోదీ పాల్గొంటారని, ఆ తర్వాత ఆరోవిల్ ఆశ్రమానికి వెళ్తారన్న సమాచారాలు సోమవారం వెలువడ్డాయి. మహానాడు కసరత్తులను రంగస్వామి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉండగా గత నెల 23న చైన్నె శివారులోని మదురాంతకంలో జరిగిన బహిరంగ సభలో అన్నాడీఎంకే, బీజేపీ కూటమిని మోదీ ప్రకటించి, నేతలను పరిచయం చేసిన విషయం తెలిసిందే. పుదుచ్చేరిలోనూ ఇదే పార్టీలు ఉన్నా, అక్కడ కార్యదర్శులుగా, నిర్వహకులు ఇతర నేతలు ఉంటున్నారు. అదే సమయంలో ఇటీవల కొత్త పార్టీగా లక్ష్య జననాయగ కట్చిని లాటరీ అధినేత మార్టిన్ వారసుడు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా తాము ఎన్డీఏలో చేరనున్నట్టు మార్టిన్ వారసుడు జోష్ చార్లెస్ ప్రకటించడం గమనార్హం.


