‘మామిడి’ వార్
సాక్షి, చైన్నె : పీఎంకేలో సాగుతున్న వివాదం నేపథ్యంలో ఆ పార్టీ మామిడి పండు చిహ్నం వ్యవహారంలో వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈమేరకు మూడు వారాల గడువును విధించింది. వివరాలు.. పీఎంకేలో రాందాసు, ఆయన తనయుడు అన్బుమణి మధ్య జరుగుతున్న సమరం గురించి తెలిసిందే. తలా ఓ శిబిరంగా పీఎంకే వ్యవహారాలను సాగిస్తూ వస్తున్నారు. అయితే ఆ పార్టీ చిహ్నం మామిడి గుర్తును చేజిక్కించుకునే ందుకు రాందాసు, అన్బుమణి తీవ్రంగా కుస్తీ పడుతున్నారు. అన్బుమణికి వ్యతిరేకంగా రాందాసు హైకోర్టును ఆశ్రయించారు. అన్బుమణి తన అనుమతి లేకుండా పార్టీ పేరు, జెండా, చిహ్నం ఉపయోగిస్తున్నారని, పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా అన్ని నిర్ణయాలు తీసుకునే అధికారం తనకు మాత్రమే ఉందని ఆ పిటిషన్‌లో రాందాసు వివరించారు. ఈ పిటిషన్ సోమవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం.ఎం. శ్రీవాస్తవ , న్యాయమూర్తి జి. అరుళ్ మురుగన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘానికి నోటీసులు పంపుతూ, మూడు వారాలు గడువు విధించారు. అదే సమయంలో అన్బుమణి తరపున హాజరైన సీనియర్ న్యాయవాది రాజా, తమ వాదనను వినాలని కోరగా కోర్టు నిరాకరించింది.


