చిన్నప్పటి నుంచే సేవాభావాన్ని అలవరుచుకోవాలి
వేలూరు: విద్యార్థినులు చిన్నప్పటి నుంచే సేవాభావాన్ని అలవరుచుకోవాలని సినీ నటుడు వైభవ్ మురుగేశన్ అన్నారు. వేలూరు జిల్లా కాట్పాడిలోని అగ్జిలియమ్ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థినుల మండలి యాక్సిస్–26 కార్యక్రమం శనివారం ఉదయం కళాశాల పిన్సిపల్ సిస్టర్ డాక్టర్ ఆరోగ్య జయశీలి అధ్యక్షతన జరిగింది. ముందుగా విద్యార్థినులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చేసి అలరించారు. ఈసందర్భంగా వివిధ స్టాల్స్ ఏర్పాటు చేసి విద్యార్థినులు విక్రయించారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కళాశాలలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి వీటిలో వచ్చే ఆదాయంతో హెచ్‌ఐవీ బాధితులతోపాటు వారి పిల్లలకు, వృద్ధులకు ఇవ్వడం అభినందనీయమన్నారు. సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో విద్యార్థినులు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడాన్ని ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రస్తుతం ఈ కళాశాలలో విద్యను అభ్యసించిన వారు అనేక మంది ఉన్నత స్థానాలకు వెళ్లారని వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అనంతరం బహుమతులను అందజేశారు. కళాశాల కార్యదర్శి సిస్టర్ మేరీజోస్విన్ రాణి, వైస్ ప్రిన్సిపల్ సిస్టర్ అమల, పరీక్షల అధికారి డాక్టర్ బ్రదర్ విన్సీ, కోఆర్డినేటర్ డాక్టర్ బ్రదర్ సహాయ మేరి, విద్యార్థి సంఘం నాయకురాలు రోస్లీన్, సుష్మ పాల్గొన్నారు.


