రంగా... శ్రీరంగా | - | Sakshi
Sakshi News home page

రంగా... శ్రీరంగా

Feb 1 2026 3:37 AM | Updated on Feb 1 2026 3:37 AM

రంగా... శ్రీరంగా

రంగా... శ్రీరంగా

● శ్రీరంగంలో కనులపండువగా రథోత్సవం ●పులకించిన వైష్ణవ క్షేత్రం ●భక్తజన సంద్రంలో భూలోక వైకుంఠం

సాక్షి, చైన్నె: రంగా..శ్రీరంగా...గోవిందా..గోవిందా..అన్న నామస్మరణ భూలోక వైకుంఠంలో శనివారం మిన్నంటింది. శ్రీరంగనాథుని క్షేత్రంలో తై మాస రథోత్సవం కోలాహలంగా జరిగింది. భక్త జన సంద్రంలో శ్రీరంగం పులకించింది. వివరాలు.. 108 వైష్ణవ క్షక్షేత్రాల్లో భూలోక వైకుంఠంగా తిరుచ్చి శ్రీరంగం ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. ఇక్కడ కొలువు దీరిన శ్రీరంగనాథ స్వామి వారి ఆలయం ఆధ్యాత్మికతకు నెలవు. ఏడు ప్రాకారాలు, 21 గోపురాలు, 50 సన్నిధులతో ఈ ఆలయం దేదీప్యమానంగా వెలుగొందుతూ వస్తోంది. ఈనెల 23వ తేదీ నుంచి ఇక్కడ తైమాసం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవంలో నాలుగో రోజున పెరుమాళ్‌ స్వామి తన బంగారు గరుడ వాహనంలో తదుపరి అశ్వ వాహనంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ ఉత్సవాలలో ముఖ్య ఘట్టం రథోత్సవం శనివారం జరిగింది. రథోత్సవం సందర్భంగా వేకువ జాము నుంచే ఆలయంలో పూజాధి కార్యక్రమాలు జరిగాయి. 4.30 గంటలకు స్వామి వారు రథంలో ఆస్తాన మండపానికి చేరుకున్నారు. ఇక్కడ జరిగిన పూజలు అభిషేకాల అనంతరం స్వామి వారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. శ్రీవిళ్లిపుత్తూరు ఆండాల్‌ అమ్మవారి ఆలయం నుంచి వచ్చిన పూల మాల, పట్టు వస్త్రాలు ధరించి , చేతిలో చిలుకతో భక్తులకు కనువిందు చేశారు. ఆరున్నర గంటల సమయంలో స్వామి వారు రథంపై ఆశీనులయ్యారు. గోవిందా..గోవిందా.. రంగా..శ్రీరంగా నామస్మరణలు మిన్నంటగా స్వామి వారి రథోత్సవం కదిలింది. తూర్పు చిత్తిరై వీధి నుంచి బయలు దేరిన రథం, దక్షిణం, పశ్చిమం, ఉత్తరం వీధుల మీదుగా ఆలయానికి చేరుకుంది. అడుగడుగున భక్తులు స్వామి వారికి కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్త జనుల కోలాటాలు, నృత్యాల నడుమ రథోత్సవం వైభవోపేతంగా జరిగింది. ఇదిలా ఉండగా ఆదివారం తైపూసం పర్వదినం కావడంతో రాష్ట్రంలో తమిళ్‌ కడవుల్‌ మురుగన్‌కు ఉన్న ఆరుపడ్డై వీడులలో విశిష్ట పూజలు జరగనున్నాయి. దీంతో మురుగన్‌ ఆలయాల వైపుగా భక్త జనం శనివారం సాయంత్రం నుంచి పోటెత్తుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement