● అవగాహన
క్యాన్సర్ అవగాహనకు మద్దతు ఇచ్చే విధంగా కావేరి ఆస్పత్రి నేతృత్వంలో కే 10 కే పేరిట 4వ ఎడిషన్ రన్ ఆదివారం జరగనుంది. ఇందులో భాగంగా అందర్నీ ఒకే వేదిక మీదకు తెచ్చే విధంగా శనివారం జరిగిన కార్యక్రమంలో రన్నర్లకు కిట్లు పంపిణీ చేశారు. – సాక్షి, చైన్నె
రూ. 105 కోట్లతో గృహ ప్రాజెక్టు
సాక్షి, చైన్నె : చైన్నె శివారులోని ఒరగడంలో రూ. 105 కోట్లతో గృహ ప్రాజెక్టు చేపట్టనున్నామని హిరానందానీ పార్క్స్ చైర్మన్ డాక్టర్ నిరంజన్, సీఈఓ ఎన్ శ్రీధర్ తెలిపారు. ఈ ప్రాజెక్టు గురంచి శనివారం స్థానికంగా ప్రకటించారు. 360 ఎకరాల విస్తీర్ణంలో టౌన్ షిప్‌గా హిరానందని కమ్యూనిటీ పార్క్ విల్లాగా ఈ గృహాలను నిర్మించనున్నామని తెలిపారు. ఒరగడం ప్రస్తుతం పారిశ్రామికంగా ప్రగతిపథంలో దూసుకెళ్తోందని గుర్తు చేస్తూ, హైటెక్ పారిశ్రామిక, నివాసన కారిడార్‌గా ఈ నిర్మాణాలు జరగబోతున్నాయని వివరించారు.తమిళనాడు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరి అథారిటీకి అనుగుణంగా 2029 జనవరి నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం లక్ష్యంగా నిర్ణయించామన్నారు.
విద్యుత్ షాక్ తో యువకుడి మృతి
తిరువొత్తియూరు: 20 రోజుల్లో వివాహం జరగనున్న క్రమంలో ఓ యువకుడు విద్యుత్‌షాక్‌కు గురై మృతిచెందాడు. తెన్కాసి జిల్లా ఆలంగూలం సంతాన మరియమ్మన్ కోయిల్ వీధికి చెందిన మయిలేరి కుమారుడు వసంతకుమార్ (27). ఇతను సొంతంగా క్యాటరింగ్, మైక్ సెట్టింగ్ పనులు చేస్తున్నారు. ఇతనికి ఇటీవల పెళ్లి నిశ్చయమైంది. జనవరి 22న పెళ్లి జరపాలని నిర్ణయించి వసంతకుమార్ కుటుంబసభ్యులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇంటికి రంగులు వేయడం పూర్తయిన తర్వాత, ఇంటి ముందు వర్షపు నీరు వెళ్లడానికి డాబా భాగంలో రేకులు ఏర్పాటు చేశారు. శుక్రవారం కిందకు వేలాడుతున్న రేకు వసంతకుమార్ మళ్లీ పైకి ఎత్తి పెట్టాడు. ఆ సమయంలో దాని పక్కనే వేలాడుతున్న బల్బు విద్యుత్ తీగ తెగి రేకుపై పడింది. ఈ ఘటనలో వసంతకుమార్‌కు విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందాడు.
తాంబరం నుంచే ఎక్స్‌ప్రెస్ రైళ్లు
దక్షిణ రైల్వే ప్రకటన
కొరుక్కుపేట: చైన్నె ఎగ్మోర్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ, అభివృద్ధి పనుల కారణంగా, ఎగ్మోర్ మార్గంలో నడిచే ప్రధాన ఎక్స్‌ప్రెస్ రైళ్లన్నీ తాంబరం నుంచి ప్రారంభం కానున్నట్లు దక్షిణ రైల్వే అధికారులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈమేరకు ఫిబ్రవరి 3 నుంచి ఏప్రిల్ 5 వరకు ఎగ్మూర్ నుంచి తంజావూరుకు వెళ్లే రైళ్లు, రామేశ్వరం –చైన్నె ఎగ్మోర్ వెళ్లే రైళ్లు ఎక్స్‌ప్రెస్ తాంబరంలో ఆగుతాయని అధికారులు వెల్లడించారు. అలాగే మిగిలిన ప్రధాన ఎక్స్‌ప్రెస్ రైళ్లన్నీ తాంబరం నుంచి నడుస్తాయని స్పష్టం చేశారు.


